Begin typing your search above and press return to search.

ఫార్ములా ఈ రేసు కేసులో కీలక విషయాలు వెల్లడి.. దర్యాప్తు సంస్థలకు స్పష్టం చేసిన ఆ ఇద్దరు

ఆ ఇద్దరు అధికారులు కీలక అంశాలను విచారణ అధికారులకు తెలియజేసినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 6:16 AM GMT
ఫార్ములా ఈ రేసు కేసులో కీలక విషయాలు వెల్లడి.. దర్యాప్తు సంస్థలకు స్పష్టం చేసిన ఆ ఇద్దరు
X

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా - ఈ రేసు కేసులో విచారణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ కేసును ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులతోపాటు ఈడి అధికారులు విచారిస్తున్నారు. ఇరు శాఖలకు చెందిన అధికారులు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఇద్దరు మాజీ అధికారులను విచారించారు. ఆ ఇద్దరు అధికారులు కీలక అంశాలను విచారణ అధికారులకు తెలియజేసినట్లు చెబుతున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాటి ఏఎంయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్ ను అవినీతినిరోధక శాఖ అధికారులు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తాజాగా ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలను అధికారులు వీరికి సంధించి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే వీరిద్దరి వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. ఈ ఇద్దరు నిందితులు గత ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఫార్ములా ఈ రేసులో ప్రక్రియను నిర్వహించినట్లు అధికారులకు వెల్లడించారు.

స్పాన్సర్ గా ఉన్న ఎస్ నెక్స్ట జన్ సంస్థ అర్ధాంతరంగా వైదొలగడం దగ్గర నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) కు హడావిడిగా నిధులు బదిలీ చేయడం వరకు జరిగిన అనేక అంశాలపై అరవింద్ కుమార్ నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు సమాధానాలను రాబట్టారు. ఉదయం 10 గంటల సమయంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలోకి వెళ్లిన ఆయనను మధ్యలో భోజన విరామం మినహా సాయంత్రం నాలుగు గంటల వరకు పలు ప్రశ్నలను సంధించారు. రేసుల నిర్వహణకు సంబంధించి ప్రతి విషయం మంత్రిత్వ శాఖకు తెలుసని ఆయన చెప్పినట్లు సమాచారం. ఏస్ నెక్స్ట్ జన్ ఒప్పందానికి విరుద్ధంగా వైదొలగడంతో ప్రభుత్వం నిధులు చెల్లించాల్సి వచ్చిందని, ఆ సంస్థపై ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులు ఆయనను ప్రశ్నించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వానికి సూచించినట్లు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే నిధులు ఎలా చెల్లించాలి అని అడగగా, మంత్రి మండలి ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేశామని, రాష్ట్ర బడ్జెట్కు సంబంధం లేదు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఆయన అధికారులకు వివరించినట్లు తెలిసింది. మరో స్పాన్సర్ ను వెతికేందుకు ప్రయత్నాలు జరిగాయని, సమయాభావం వల్ల వీలుపడలేదని చెప్పినట్లు చెబుతున్నారు. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు బాధ్యులకు చెబుతూనే ఉన్నామని అరవింద్ కుమార్ అధికారుల ప్రశ్నలకు సమాధానం గా చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో మరో కీలకమైన వ్యక్తిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని ఈడి అధికారులు ప్రశ్నించారు. ఈయన కూడా అరవింద్ కుమార్ మాదిరిగానే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఎఫ్ఈఓ కు నిధులు చెల్లింపునకు సంబంధించి నాటి చీఫ్ ఇంజనీర్ హోదాలో ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఆయనే కావడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం దగ్గరనుంచి నిధులు బదిలీ వరకు అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన రాత్రి 7 గంటల సమయంలో తిరిగి వెళ్లారు. అప్పటివరకు అధికారులు ఆయనను విచారించారు.

ఎఫ్ఈఓ కు నిధులు చెల్లించడంలో తన పాత్ర పరిమితమని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఉన్నత స్థాయిలో అధికారులు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం తప్ప తన ప్రమేయం లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. స్పాన్సర్షిప్ మొదలు రేసు నిర్వహణకు అయ్యే ఖర్చులు, వాటి చెల్లింపులు వంటివన్నీ పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలేనని స్పష్టం చేశారు. అధికారులు జారీ చేసిన ఆదేశాలను తాను పాటించాలని చెప్పినట్లు తెలుస్తోంది. నాటి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన కొన్ని ద్రోపత్రాలను సమర్పించినట్లు చెబుతున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఈ ఇద్దరు ఒకే విధమైన సమాధానాలను చెబుతుండడంతో అధికారులు ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. మరోసారి ఈ ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.