కూతురు ‘సియా’ చేసిన పాపానికి ‘ప్రాయశ్చిత్తం’ కోరుతున్న తండ్రి ఆవేదన.. వైరల్
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
By: A.N.Kumar | 17 July 2026 1:29 PM ISTదేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాబోయే భర్తను అత్యంత దారుణంగా లోయలోకి తోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కన్నకూతురు చేసిన ద్రోహం ఒకవైపు.. సమాజం నుండి ఎదురవుతున్న ఛీత్కారాలు మరోవైపు.. వెరసి ఓ తండ్రిగా ఆయన అనుభవిస్తున్న నరకయాతన ఈ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
క్షమించరాని నేరం.. కఠినంగా శిక్షించండి
మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చట్టం ముందు కన్నప్రేమ ఓడిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. "నా కూతురు తప్పు చేసిందని కోర్టులో నిరూపితమైతే ఎలాంటి కనికరం చూపించవద్దు. ఆమెకు అత్యంత కఠినమైన శిక్ష విధించండి. అవసరమైతే ఉరితీసి.. కేతన్ దగ్గరకే పంపించేయండి. కేతన్ ఎలాంటి తప్పు చేయలేదు. అతడు కేవలం నా కూతురిని పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని మాత్రమే అనుకున్నాడు. ఒకవేళ సియాకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే మాకు ముందుగానే చెప్పి ఉండాల్సింది. ఆమె నిర్ణయాన్ని మేము గౌరవించేవాళ్లం. కానీ ఇలా ఒక అమాయకుడి ప్రాణం తీయడం క్షమించరాని నేరం." అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తండ్రిగా కేతన్ కుటుంబం పడుతున్న కడుపుకోతను తాను అర్థం చేసుకోగలనని.. ఈ పాపంలో సియాకు పోలీసులు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు.
ఆ తప్పుకు మా కుటుంబాన్ని శిక్షించకండి..
కూతురు చేసిన ఘాతుకానికి తమ కుటుంబం ఇప్పటికే సమాజం దృష్టిలో దోషిగా నిలబడిందని ప్రవీణ్ వాపోయారు. తాము మానసికంగా చచ్చి బతుకుతున్నామని, ప్రతిక్షణం నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల వారు, సమాజం తనిని, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని తెలిపారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడితో బతుకుతున్నట్లు పేర్కొన్నారు. "ఆమె చేసిన తప్పుకు ఇప్పటికే మా కుటుంబం సర్వస్వం కోల్పోయింది. దయచేసి సమాజం మమ్మల్ని ఇంక శిక్షించవద్దు" అంటూ ఆయన చేతులెత్తి వేడుకున్నారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్
మరోవైపు ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అత్యంత వేగంగా విచారిస్తోంది. సియా గోయల్ తన ప్రియుడు చేతన్‌తో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారమే కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
ఇప్పటికే ఘటనా స్థలంలో సీన్ రీక్రియేషన్ పూర్తి చేసిన పోలీసులు, నిందితుల బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించారు. కేతన్ ద్వారా వచ్చిన డబ్బును సియా తన ప్రియుడు చేతన్‌కు బదిలీ చేసినట్లు సాంకేతిక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని.. త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. కన్నకూతురి పాపానికి ఓ తండ్రి విలపిస్తున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
