Begin typing your search above and press return to search.

రియాక్షన్ రిక్వైర్డ్... కేశినేని నానికి ఫుల్ పనప్పగించిన టీడీపీ!

అవును... వైఎస్ జగన్ తో భేటీ, అనంతరం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలతో కేశినేని నానీపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:38 AM GMT
రియాక్షన్  రిక్వైర్డ్... కేశినేని నానికి ఫుల్  పనప్పగించిన టీడీపీ!
X

బెజవాడ కేంద్రంగా ఏపీలో రసవత్తర రాజకీయానికి తెరలేచింది. వైఎస్ జగన్ ఇంఛార్జ్ లను మారుస్తున్న సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తూ పయణమైన నేపథ్యంలో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ ఎంపీ, టీడీపీ కీలక నేత కేశినేని నానీ జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందు చంద్రబాబు, లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేని వ్యక్తి అని, ఆఫ్ట్రాల్ అని, క్యారెక్టర్ లెస్ ఫెలో అని పలు పదప్రయోగాలు చేశారు! దీంతో ఒక్కసారిగా బెజవాడ రాజకీయం వేడెక్కింది! శీతాకాలంలో కూడా రోహిణీకార్తిని తలపించింది. ఈ ప్రెస్ మీట్ అనంతరం... కృష్ణాజిల్లా టీడీపీ నేతలు మైకులముందుకు వచ్చారు. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు. నానీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అవును... వైఎస్ జగన్ తో భేటీ, అనంతరం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలతో కేశినేని నానీపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఇందులో ప్రధానంగా బుద్దా వెంకన్న, దేవినేని ఉమ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తొలుత నానీపై నిప్పులు చెరిగిన బుద్దా వెంకన్న... ఇవాళ్టి నుంచి ఆట మొదలైంది, నీకు సినిమా చూపిస్తా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడు అని మండిపడ్డారు.

ఇదే సమయంలో విజయసాయి రెడ్డితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. కేశినేని నాని వైసీపీ కోవర్టు అని.. చంద్రబాబుకు చెప్పకుండానే శ్వేతను కేశినేని నాని మేయర్ పదవికి నిలబెట్టారని.. కేశినేని నానికి ద ఎండ్ కార్డు పడడం ఖాయమని.. కేశినేని నాని చిట్టా తన దగ్గర ఉందని బుద్దా వెంకన్న గుక్కతిప్పుకోకుండా అన్నట్లుగా విమర్శల వర్షం కురిపించారు!

ఇక అనంతరం మైకులముందుకు వచ్చిన దేవినేని ఉమ... విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నాయకులు నానికి దూరంగా ఉంటున్నది ఆయన నోటి దురుసుతనం వల్లేనని ఆరోపించారు. ఇదే సమయంలో... 2019 ఎన్నికల్లో నాని గెలుపు కోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు, పార్టీ డబ్బు ఖర్చుపెట్టింది తప్ప.. నాని రూపాయి పెట్టలేదని అన్నారు.

ఇదే క్రమంలో తన ట్రావెల్స్ వ్యాపారం నాని వదులుకోవడానికి కారణం నష్టాలు రావడమేనని ఆరోపించిన దేవినేని ఉమ... కేశినేని ఆస్తులు అమ్ముకుంది, ఆ నష్టాల నుంచి బయటపడటానికేనని తెలిపారు. అలా వచ్చిన నష్టాలను చంద్రబాబుకి ఆపాదించడం అతని దిగజారుడుతనమే అని ఉమ విమర్శించారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే.. నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని మండిపడ్డారు.

ఇలా అటు బుద్దా వెంకన్న, ఇటు దేవినేని ఉమ చేసిన తీవ్ర వ్యాఖ్యలు... కేశినేని నాని ప్రెస్ మీట్ లో చెప్పిన వాటికి పూర్తి భిన్నంగా, వాటికి క్లారిటీ ఇస్తున్నట్లుగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... వీరిద్దరి కామెంట్లపై కేశినేని నాని స్పందిస్తారా.. స్పందిస్తే అది ఏస్థాయిలో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. కారణం... విజయవాడ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉండటమే!