Begin typing your search above and press return to search.

ఎంపీ సీటు గొడవ.. అన్నదమ్ముల రణరంగం!

ఈ పరిణామాల పట్ల గత కొంతకాలంగా కేశినేని నాని రగిలిపోతున్నారు. తన తమ్ముడు కేశినేని చిన్ని పేరు ఎత్తకుండానే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 6:05 AM GMT
ఎంపీ సీటు గొడవ.. అన్నదమ్ముల రణరంగం!
X

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు జనవరి 3న మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి, అదే పార్టీలో ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా తదితర నేతలకు మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు. ఈ రెండు వర్గాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇప్పుడు వీరి మధ్యలోకి కేశినేని నాని సోదరుడు, వ్యాపారవేత్త కేశినేని చిన్ని వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి సీటు ఇవ్వరని విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికేనని ఇప్పటికే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ పరిణామాల పట్ల గత కొంతకాలంగా కేశినేని నాని రగిలిపోతున్నారు. తన తమ్ముడు కేశినేని చిన్ని పేరు ఎత్తకుండానే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు టీడీపీ కార్యాలయంలో అన్నదమ్ములు (కేశినేని నాని, చిన్ని) వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో స్థానిక ఎస్సై తలకు గాయాలయ్యాయి.

జనవరి 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో సభ నిమిత్తం రానున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్ల పరిశీలనకు పలువురు నేతలు తిరువూరు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌ మీరాలతో కలిసి కేశినేని నాని తిరువూరు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇంచార్జి దేవదత్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ కేశినేని నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.

ఉద్దేశపూర్వకంగానే ఎంపీ కేశినాని నాని ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గీయులు బైఠాయించారు. ఇందుకు నియోజకవర్గ ఇంచార్జి దేవదత్‌ కారణమని ఆరోపిస్తూ ఆయనపై నాని వర్గీయులు దాడికి ప్రయత్నించారు. దీంతో స్థానిక నేతలు దేవదత్‌ ను ఒక గదిలో ఉంచి తలుపులు వేసేశారు.

ఈ క్రమంలో బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం కేశినేని చిన్ని కూడా తిరువూరు పార్టీ కార్యాలయానికి వచ్చారు. దీంతో నాని వర్గీయులు రెచ్చిపోయారు. చిన్నీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా చిన్ని వర్గీయులు కూడా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకుంది. కుర్చీలు విసురుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రెండు గంటలపాటు తిరువూరు టీడీపీ కార్యాలయం ముందు గందరగోళం ఏర్పడింది.

కాగా కేశినేని నాని వర్గీయులు తనను పరుష పదజాలంలో దూషించారని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి దేవదత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నాయకుడినని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని వాపోయారు. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారని మండిపడ్డారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు.. ఎక్కడ గెలిపించారు.. మీరు మాత్రమే గెలిచారు.. తక్కినవి ఓడిపోయారని కేశినేని నానిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కాగా ఈ గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కీలకమైన ఎన్నికల సమయంలో సీనియర్‌ నేతలు రోడ్డుకెక్కి రచ్చ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముంగిట ఇలాంటి విభేదాలకు త్వరగా అడ్డుకట్ట వేయకపోతే ఆ పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని అంటున్నారు.