Begin typing your search above and press return to search.

బాబుకి ఇవ్వకుండా బోకేను ఎందుకు తోసేశానంటే...!

ఒకసారి టీడీపీ అధినేత చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లారు. ఆయనకు పార్టీ ఎంపీలు అంతా ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.

By:  Tupaki Desk   |   19 March 2024 3:51 AM GMT
బాబుకి ఇవ్వకుండా బోకేను ఎందుకు తోసేశానంటే...!
X

ఒకసారి టీడీపీ అధినేత చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లారు. ఆయనకు పార్టీ ఎంపీలు అంతా ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నానిని బోకె బాబుకు ఇవ్వమని చెబితే ఆయన తోసేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది.

బాబుకు బోకే ఇవ్వకుండా నిరాకరించడం, బోకేని తోసేయడం అంటే అది అతి పెద్ద పొలిటికల్ న్యూస్ అయింది. సొంత పార్టీకి చెందిన ఎంపీ ఇలా చేయడం బాబుకు ఇది తీరని అవమానం అని అంతా విమర్శించారు. ఇదిలా ఉంటే ఆనాటి బోకే తోసివేయడం వెనక జరిగిన సంగతులను సీక్రెట్ ని ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేశినేని నాని చెప్పారు.

ఆ రోజున బోకే ఇవ్వడానికి ముందు తనకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కి మధ్య గొడవ జరిగిందని కేశినేని చెప్పుకొచ్చారు. నీ ఫేస్ బుక్ లో నా ఫోటో పెట్టడం లేదు ఎందుకు అని గల్లా జయదేవ్ తనను ప్రశ్నించారు అని దానికి తాను లోకేష్ ఫోటోవే పెట్టను నీది ఎందుకు పెడతాను నీవు నాకు కోలీగ్ వరకే అని బదులిచ్చాను అని కేశినేని అన్నారు.

అలా ఇద్దరి మధ్యన మాటా మాటా పెరిగిందట. అపుడు చంద్రబాబు ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ కోపంతో బోకేని బాబుకు ఇవ్వకుండా జయదేవ్ మీదకు తోసేసినట్లుగా కేశినేని నాని చెప్పారు. ఆ సందర్భం అది ఆ నేపధ్యం అది అని కేశినేని అన్నారు.

అయితే అది మీడియాలో మాత్రం చంద్రబాబు మీద కేశినేని అసంతృప్తితో మండిపడ్డారు అన్నట్లుగా వచ్చింది. దాని మీద ఆయన ఏనాడూ వివరణ ఇవ్వలేదు. ఈ రోజు దాకా అదే అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు మీడియాలో ఇంటర్వ్యూ పుణ్యమాని అసలు ఎవరి మీద కేశినేనికి కోపం ఉందో తెలిసి వచ్చింది.

ఇదిలా ఉంటే అదే ఇంటర్వ్యూలో కేశినేని నాని చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. చంద్రబాబుది పాము లాంటి మనస్తత్వం అని కూడా విమర్శించారు. పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా తన దగ్గరకు వచ్చిన నాయకులను తన ప్రయోజనాల కోసం మింగేయడం బాబుకు అలవాటు అని కేశినేని ఘాటు విమర్శలు చేశారు. అదే ఆయన వీక్ నెస్ అని కూడా అన్నారు.

ఏకంగా 88 ఏళ్ల పాటు నడచిన కేశినేని ట్రావెల్స్ ని బాబు కారణంగానే మూసి వేశాను అని కేశినేని చెప్పారు. తాను పార్టీలో పన్నెండేళ్ల పాటు ఉన్నానని అయితే తనను వాడుకున్నారు తప్ప తనకేమీ ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. చంద్రబాబు తత్వం ఎపుడూ ఇతరులను వాడుకోవడమే అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.