Begin typing your search above and press return to search.

జ‌నసేన‌లోకి ఎంపీగారి త‌మ్ముడు? .. ప‌వ‌న్‌తో భేటీ!

కేశినేని శివ‌నాథ్ ఉర‌ఫ్ చిన్ని.. జ‌నసేన తీర్థం పుచ్చుకోనున్నారా? టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య పొస‌గ‌ని నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా ఆయ‌న జ‌న‌సేన‌కు జై కొట్ట‌నున్నారా?

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:01 PM GMT
జ‌నసేన‌లోకి ఎంపీగారి త‌మ్ముడు?  .. ప‌వ‌న్‌తో భేటీ!
X

విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్.. ఉర‌ఫ్ నాని సోద‌రుడు కేశినేని శివ‌నాథ్ ఉర‌ఫ్ చిన్ని.. జ‌నసేన తీర్థం పుచ్చుకోనున్నారా? టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య పొస‌గ‌ని నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా ఆయ‌న జ‌న‌సేన‌కు జై కొట్ట‌నున్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయాల‌ని శివ‌నాథ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. పోనీ.. ఎంపీ కాక‌పోయినా.. అసెంబ్లీ కైనా పోటీ చేయాల‌ని బావిస్తున్నారు.

అయితే.. టీడీపీలో ఆయ‌న‌కు పెద్ద‌గా అవ‌కాశాలు చిక్క‌డం లేదు. దీంతో ఎలానూ టీడీపీతో పొత్తు ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సేన నుంచి ఆయ‌న ట్రై చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను శివనాథ్ కల‌వ‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైదరా బాద్‌లోని జనసేనాని నివాసంలో పవన్‌‌తో చిన్ని భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో టీడీపీ, పార్టీ శ్రేణులకు పవన్ మద్దతు ఇవ్వడంపై చిన్ని ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటు పరిధిలో చిన్ని చేస్తున్న సేవలు అన్నా క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ అభినందించారు.

వన సమారాధనల పేరిట ఇతర కార్యక్రమాలతో జనసేన, టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్న వైనాన్ని చిన్ని వివరించారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా చంద్రబాబు ఆదేశాల మేరకు పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను చిన్ని వివరించారు. అయితే.. రాజ‌కీయ ప‌ర‌మైన విష‌యాల‌పై మాత్రం మీడియాకు ఆయ‌న ఎలాంటి వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. కానీ, ఉత్తిపుణ్యానికి అయితే, శివ‌నాథ్‌.. ప‌వ‌న్‌ను క‌లిసే అవ‌కాశం లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకునే ఈ భేటీ జ‌రిగింద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.