‘‘దొరా.. పిట్ట కథలు చెప్పొద్దు’’ తమ్ముడిపై మాజీ ఎంపీ కేశినేని సెటైర్లు
బెజవాడ బ్రదర్స్, సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మధ్య పోరు మరింత ముదిరింది.
By: Tupaki Desk | 6 May 2025 11:33 AM ISTబెజవాడ బ్రదర్స్, సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మధ్య పోరు మరింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న మొదలుపెట్టిన ఈ యుద్ధం నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తనను జగన్ గూఢాచారిగా పేర్కొంటూ ఎంపీ చిన్ని విమర్శలను తిప్పికొడుతూ తాజాగా మరో పోస్టు పెట్టారు మాజీ ఎంపీ నాని.
ఏప్రిల్ 22న తన ఫేస్ బుక్ అకౌంటు ద్వారా ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని తీవ్ర ఆరోపణలు చేస్తూ యుద్ధం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రోజూ ఏదో ఒక పోస్టు ద్వారా తమ్ముడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇద్దరూ సొంత అన్నదమ్ములైనా, వారి మధ్య రాజకీయంగా, కుటుంబ పరంగా తీవ్ర విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా సైలెంటుగా ఉన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక గత పదిహేను రోజులుగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లు ద్వారా విజయవాడ ఎంపీపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ పేరిట ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు సతీశ్ అబ్బూరి, మరికొందరు కలిసి 60 ఎకరాలు కొల్లగొట్టారని, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేటు లిమిటెడ్’ ఒక ఊరు పేరు లేని సంస్థ అంటూ తొలుత మాజీ ఎంపీ నాని ఆరోపించారు. ఈ విషయంలో నాని విమర్శలు చేసిన తర్వాతే ప్రధాన ప్రతిపక్షం రంగంలోకి దిగి రచ్చరచ్చ చేసింది. ఈ వివాదం సర్దుమణిగిందని అనుకుంటుండగా, తాజాగా ఏపీ లిక్కర్ స్కాంలో విజయవాడ ఎంపీకి సంబంధాలు ఉన్నయంటూ ఆరోపించారు. దీనిపై ఎంపీ కేశినేని స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో సోదరుడు, మాజీ ఎంపీపై కౌంటర్ అటాక్ చేశారు.
‘‘Kesineni Nani నీ నీతిమాలిన ఆరోపణలకు స్పందించిల్చిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, మా పార్టీ క్యాడర్ కు స్పష్టత ఇవ్వడం కోసం , వెన్ను పోటుదారుడు, నయవంచకుడు, నమ్మక ద్రోహీ, జగన్ రెడ్డికి గూఢచారిగా పని చేసిన వ్యక్తివి నువ్వు...
నేడు పనిగట్టుకుని చేసే పనికిమాలిన పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం వుండటం కారణంగా సంయుక్తంగా నిర్మాణం చెపడ్డాడానికి 2021లో రిజిస్టర్ అయిన సంస్థ. అందుకు సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్ లో అందరికి అందుబాటులో వుండేవే.
క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకోడం జరిగింది. ఆ నిర్ణయం కారణంగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నానీ సృష్టించన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన భాధ్యత, నాపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుంది. జగన్ రెడ్డి లాంటి కాలకేయుడు పాలనలో కన్నతల్లి లాంటి పార్టీని వెన్ను పోటు పొడిచి, జె గ్యాంగ్ తో కుట్రపన్ని ఈ సదరు ‘పెద్ద’ చిమ్మిన విషం ప్రజలు , పార్టీ మరువలేదు. నీలో సత్తావుంటే నాకు కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించు. లేదంటే ఉత్తరాల పేరుతో ఉత్త చెత్త కట్టిపెట్టు...’’ అంటూ ఎంపీ సుదీర్ఘ పోస్టు రాశారు.
ఇక ఎంపీ కేశినేని చిన్ని విసిరిన సవాల్ కు ఈ రోజు మాజీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ‘‘దొరా నువ్వు ఎన్ని "పిట్ట కథలు " చెప్పినా బుకాయించినా నువ్వు రాజ్ కెసిరెడ్డి కలసి 2019 డిసెంబర్ నుండి మద్యం కుంభకోణం సొమ్ములు నీకు నీవారికి సంబంధించిన దాదాపు 56 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాలకు దారి మళ్లించిన విషయం యదార్థం !!! అంటూ ముక్తాయించారు. దీంతో ఇద్దరు సోదరుల మధ్య ఫైట్ పీక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తి రేపుతోంది.
