నాని తగ్గరు.. చిన్ని పట్టించుకోరు.. బెజవాడ పాలిటిక్స్
గత రెండేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ నాని సిట్టింగ్ ఎంపీ చిన్నిపై మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Political Desk | 7 July 2026 6:00 PM ISTరాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో అన్నాదమ్ముల యుద్ధం అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తమ్ముడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా మాజీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న పోరాటం ఎక్కడ వరకు దారితీస్తుందో అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు గత ఎన్నికల ముందు రాజకీయ ప్రత్యర్థులుగా మారడం, ఎన్నికల అనంతరం కూడా ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తుండటమే ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ నాని తన రాజకీయ ప్రత్యర్థి, సొంత తమ్ముడు ఎంపీ చిన్ని విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్లు పదునైన విమర్శలు చేస్తుండటమే హాట్ టాపిక్ అవుతోంది.
గత రెండేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ నాని సిట్టింగ్ ఎంపీ చిన్నిపై మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. గత నెల రోజులుగా చిన్ని టార్గెట్ గా నాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూ ఎంపీ చిన్నిని ఇరుకున పెట్టే అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఎంపీపై ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని నాని స్వయంగా తన ఎక్స్, ఫేస్ బుక్ ఖాతాల్లో వెల్లడిస్తూ కాక రాజేస్తున్నారు. మరోవైపు తన సోదరుడు, మాజీ ఎంపీ నాని వరుస పెట్టి ఫిర్యాదులు చేస్తున్నా ఎంపీ చిన్ని పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని అంటున్నారు. ఎంపీని కట్టడి చేసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా, అవి రాజకీయ ఫిర్యాదులు కావడంతో పోలీసులు పెద్దగా స్పందించడం లేదని చెబుతున్నారు.
దీంతో విజయవాడలో అన్నాదమ్ముల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. తనను ఓడించిన ఎంపీ చిన్నిని రాజకీయంగా ఒంటరిని చేయాలనే లక్ష్యంతో మాజీ ఎంపీ నాని అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఎంపీ, ఆయన అనుచరుల కదలికలపై నిఘా వేసినట్లు ప్రతి విషయాన్ని ఎత్తిచూపుతూ రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నారు. విపక్షం వైసీపీ కూడా ఎంపీ చిన్నిని ఇంతలా టార్గెట్ చేయలేదని అంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే మాజీ ఎంపీ నాని ఘాటు విమర్శలు చేస్తుండటమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు తనను లక్ష్యం చేసుకుని మాజీ ఎంపీ నాని వరుసగా ఆరోపణలు చేస్తున్నా ఎంపీ చిన్ని సైలెంటుగా ఉంటున్నారు. దీంతో ఆయన రాజకీయ వ్యూహం ఏమైవుంటుందనే చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటిస్తూ నాని విమర్శలకు విలువ ఇవ్వడం లేదనే సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహిస్తున్నారు. ఎంపీపై మాజీ ఎంపీ నాని వరుస పెట్టి బాణాలు ఎక్కుపెడుతుంటే, ఎంపీ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఎంపీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నా సరే ఆయన పెదవి విప్పకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోందని అంటున్నారు. అయితే మాజీ ఎంపీ చేసే ప్రతి విమర్శకు స్పందిస్తే, మనం కూడా ఆయనలా ఖాళీగా ఉన్నామనే భావన ఏర్పడుతుందని, ప్రస్తుతం ఏ విధమైన వ్యాపకం లేకనే మాజీ ఎంపీ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఎంపీ చిన్ని అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. దీంతో నాని ఎంతలా రెచ్చగొట్టినా తాను తొణకేది, బెదిరేది లేదని తేల్చిచెప్పాలనే ఉద్దేశమే ఎంపీ చిన్నిలో కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
