Begin typing your search above and press return to search.

అరాచక పోలీసు రాజ్యం.. మాజీ ఎంపీ కేశినేని ఫైర్!

విజయవాడ పోలీసులపై మాజీ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు. ప్రధానంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

By:  Tupaki Political Desk   |   18 Jun 2026 9:34 PM IST
అరాచక పోలీసు రాజ్యం.. మాజీ ఎంపీ కేశినేని ఫైర్!
X

విజయవాడ పోలీసులపై మాజీ ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరిగారు. ప్రధానంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. నగరంలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం మిస్టరీపై మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపేసి దహనం చేశారని, ఆధారాలు లభించకుండా అస్తికలను కృష్ణా నదిలో కలిపేశారంటూ మాజీ ఎంపీ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

విజయవాడలో కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం మిస్టరీపై మాజీ ఎంపీ నాని చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది. రాజకీయాలకు దూరం అంటూ గతంలో ప్రకటించిన నాని.. నగరంలో పోలీసుల అరాచకాలను ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా చూస్తూ ఊరుకోలేకపోతున్నానని ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు, కృష్ణలంక పోలీసులు గడె సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించారు. కస్టడీలో హత్య చేశారు. అంతేకాకుండా అతని మృతదేహాన్ని అక్రమంగా పారవేశారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాను’’ అంటూ మాజీ ఎంపీ నాని ట్వీట్ చేశారు.

మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, అస్థికలను కృష్ణా నదిలో కలిపేసిన తీరు చూస్తుంటే ఫోరెన్సిక్ ఆధారాలను నాశనం చేసేందుకు జరిగిన ఒక భారీ, అత్యున్నత స్థాయి క్రిమినల్ కుట్రగా కనిపిస్తోందంటూ నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రస్తుత సీపీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం, సిటీ టాస్క్ ఫోర్స్ బలవంతపు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారెంట్లు లేకుండా అర్ధరాత్రి అక్రమ సోదాలు నిర్వహిస్తూ పౌరులను బెదిరిస్తున్నారని, ఉన్నతాధికారులే ఇందులో భాగస్వాములు అయ్యారని నాని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై అంతర్గత విచారణలు కేవలం ఒక ప్రహసనమే అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో శాంతిభద్రతలను కాపాడేందుకు సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేశినేని నాని, మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఒక బాధ్యతాయుత ప్రజా ప్రతినిధిని’’ ఆయన స్వయంగా చెప్పడం చూస్తుంటే మళ్లీ నగర రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయాలని భావిస్తున్నట్లు ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని అంటున్నారు. వైసీపీ వాదనకు బలం చేకూర్చేలా కేశినేని నాని కూడా పోలీసులపై, ముఖ్యంగా సీపీపై విమర్శలు ఎక్కుపెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోందని అంటున్నారు.