కేశినేని చిన్ని Vs కొలికపూడి.. ఈ పోరుకు ఎండింగ్ లేదా?
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి చర్చకు దారితీశాయి.
By: Tupaki Desk | 3 March 2026 10:00 AM ISTవిజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. అధిష్టానం జోక్యం చేసుకున్నా ఆ ఇద్దరి మధ్య రాజీ కుదరడం లేదు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి తాజాగా మరో షాక్ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకులకు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సమయంలో ఇద్దరు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నించడం, ఎంపీకి షాక్ ఇచ్చేలా ఎమ్మెల్యే కొలికపూడి నడుచుకోవడంతో భక్తులు నివ్వెర పోయారు.
దైవ సన్నిధిలో ఇద్దరు నేతల రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎంపీ చిన్ని సతీసమేతంగా వెళ్లారు. ఆలయ సంప్రదాయల ప్రకారం స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ చిన్నికి అర్చకులు అందజేశారు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి ప్రొటోకాల్ ప్రకారం తన చేతికి పట్టువస్త్రాలు ఇవ్వాల్సిందిగా ఆలయ అధికారులను కోరారు. దీంతో అప్పటికే ఎంపీ చేతికి పట్టువస్త్రాలు ఇచ్చిన అందున ఎమ్మెల్యేకు ముత్యాల దండలు అందజేశారు. అయితే వాటిని తీసుకోని ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ చిన్ని చేతిలో ఉన్న పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కున్నారు.
ఈ పరిణామంతో అక్కడ ఉన్న భక్తులు, ఆలయ అధికారులు, అర్చకులు షాక్ తిన్నారు. అదేసమయంలో ఎంపీ అనుచరులు ఎమ్మెల్యే కొలికపూడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఎంపీ చిన్ని కలగజేసుకుని తన అనుచరులను వారించారు. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు సైతం వాగ్వాదానికి సిద్ధమవడంతో ఆలయం వద్ద గందరగోళం ఏర్పడింది. ఇక ఆ తర్వాత కూడా ఎంపీకి చెక్ చెప్పేలా ఎమ్మెల్యే కొలికపూడి నడుచుకోవడంపై పెద్ద డిబేట్ జరుగుతోంది. కల్యాణోత్సవాలు సందర్భంగా ఆలయంలో ముందు వరుసలో ఎమ్మెల్యే కూర్చోగా, ఎంపీ వెనుక వరుసలో కూర్చోవాల్సివచ్చింది.
ఈ వేడుకలు తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కన్యాదానం చేసేందుకు సుమారు 250 జంటలు నమోదు చేసుకున్నాయి. వీరితోపాటే ఎంపీ దంపతులు కూర్చోవాల్సివచ్చింది. కాగా, ఈ పరిణామాలు టీడీపీలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల సమక్షంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీ పరువు తీసేలా ప్రవర్తించడమేంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు పరస్పర గౌరవంతో నడుచుకుంటే హుందాగా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. దైవ సన్నిధిలో రాజకీయాలు చేయడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
