సోషల్ మీడియా రోడ్లపై కొట్లాట.. తీవ్రస్థాయిలో బెజవాడ బ్రదర్స్ యుద్ధం
బెజవాడ బ్రదర్స్ మధ్య రాజకీయ యుద్ధం పరాకాష్టకు చేరుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.
By: Tupaki Desk | 23 April 2025 3:00 PM ISTబెజవాడ బ్రదర్స్ మధ్య రాజకీయ యుద్ధం పరాకాష్టకు చేరుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. పేరు పెట్టకుండానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. అన్నదమ్ములు బంధానికి ఏ మాత్రం విలువనివ్వకుండా ఇద్దరూ రాజకీయ ఆధిపత్యం కోసం విమర్శల కత్తులు దూసుకుంటుండటంతో వారి మధ్య పోరు రక్తికట్టిస్తోంది. నీ కార్యాలయానికి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టాలంటూ ఒకరు.. సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోందంటూ మరొకరు దెప్పి పొడుచుకుంటుండటం చర్చనీయాంశమవుతోంది.
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రెండు రోజులుగా సోషల్ మీడియాలో తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై యుద్ధాన్ని ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే. తమ్ముడు చేతిలో ఘోరంగా ఓడిపోయిన నాని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ రీ ఎంట్రీకి ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తనకు అన్నిరకాలుగా కంఫర్టుగా ఉండే టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే కేశినేని నాని విషయంలో ఎంపీ కేశినేని చిన్ని డెసిషన్ ఫైనల్ అన్నట్లు పార్టీ పెద్దలు తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన అన్న రావడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని, అయితే గతంలో చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేసిన నాని చేరికకు కూటమి పార్టీలు అన్నీ ఓకే చెప్పాలని ఎంపీ చిన్ని పుల్లలు వేస్తున్నారని అంటున్నారు. దీంతో తన రాజకీయ పునరాగమనానికి అడ్డుపడుతున్న ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ నాని రెండు రోజులుగా ఫేస్ బుక్ పోస్టింగులతో యుద్ధం ప్రకటించారు.
రెండు రోజుల క్రితం ఎంపీ చిన్ని సన్నిహితుల కోసం విశాఖలో 60 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్న ప్రశ్నించిన మాజీ ఎంపీ నాని.. బుధవారం మరో పోస్టు పెట్టారు. విజయవాడలో ఎంపీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఆక్షేపిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు మాజీ ఎంపీ కేశినేని నాని. ''NTR BHAVAN-VIJAYAWADA’' ఇది విజయవాడ ప్రజలు చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించుకున్నారు అని గర్వంగా చెప్పుకునే ప్రజాప్రతినిధిగారి కార్యాలయం పేరు .
కానీ, ఇక్కడ కూర్చుని ఆయన చేసేది ఇసుక వ్యాపారం, ఫ్లై ఆష్ తోలకం, గ్రావెల్ అమ్మకం, భూ దందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగైరా వగైరా.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎంపీ నాని.. ‘‘ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. నీతికి నిజాయతీకి మారుపేరు ప్రజా సేవ అంటే చాలా పవిత్ర కార్యక్రమం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. కాబట్టి నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్ భవన్’’ అంటూ పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇది భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక అంటూ ముగించారు.
ఇక తన సోదరుడు మాజీ ఎంపీ నాని ఫేస్ బుక్ పోస్టులో తనను టార్గెట్ చేయడంతో ఎంపీ నాని కూడా విమర్శల కత్తి దూశారు. ‘‘ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక.సోషల్ మీడియా రోడ్ల మీద మతి బ్రమించి తిరుగుతున్న సైకో.చిప్పు దొబ్బి సోషల్ వాల్స్ పై కసి,పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో.స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి ఇట్లు కేశినేని శివనాథ్, ఎంపీ’’ అంటూ తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. దీంతో అన్నదమ్ముల మధ్య సోషల్ మీడియా ఫైటింగ్ పీక్స్ కు చేరుకుందని టాక్ వినిపిస్తోంది. అదేసమయంలో ఈ ఇద్దరు సోదరుల అభిమానులు సైతం ఆయా పోస్టింగులకు మద్దతుగా కామెంట్లు పెడుతూ తమ ప్రత్యర్థులతో యుద్ధం కొనసాగిస్తుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
