నాని ఎంట్రీకి చిన్ని ఓకే? కానీ కండీషన్స్ అప్లై అంట..
విజయవాడ మాజీ ఎంపీ, తన సోదరుడు కేశినేని నాని తిరిగి టీడీపీలో చేరడంపై సిటింగ్ ఎంపీ కేశినేని చిన్ని ఓకే అన్నారు, కానీ ఓ కండీషన్ మాత్రం విధించారు
By: Tupaki Desk | 11 April 2025 3:00 AM ISTవిజయవాడ మాజీ ఎంపీ, తన సోదరుడు కేశినేని నాని తిరిగి టీడీపీలో చేరడంపై సిటింగ్ ఎంపీ కేశినేని చిన్ని ఓకే అన్నారు, కానీ ఓ కండీషన్ మాత్రం విధించారు. ఆ కండీషనే మాజీ ఎంపీ పునరాగమానికి చిక్కులు తెస్తోందని అంటున్నారు. ఎన్నికలకు ముందు తన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నికి టీడీపీ ప్రాధాన్యమివ్వడంపై కినుక వహించిన కేశినేని నాని టీడీపీకి కటీఫ్ చెప్పారు. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వెంటనే వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. సొంత తమ్ముడి చేతిలో ఓడిపోయారు.
వరుసగా రెండు సార్లు విజయవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని మూడోసారి ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2019లో వైసీపీ వేవ్ ను కూడా తట్టుకుని విజయం సాధించిన ఆయన 2024లో టీడీపీ సునామీని తప్పించుకోలేకపోయారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత పది నెలలుగా రాజకీయంగా సైలెంటుగా ఉన్న నాని తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన మళ్లీ సొంత గూటికి వచ్చేస్తారంటూ చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారంపై తిరుపతిలో గురువారం ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు.
తన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి టీడీపీలోకి రావడానికి తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే కూటమిలో ఎవరు చేరాలన్నా, ఒక కండీషన్ అప్లై అవుతుందని, ఆ కండిషన్ ప్రకారం నాని చేరికకు ఎలాంటి అవాంతరాలు లేకపోతే తనకు ఓకే అన్నారు ఎంపీ చిన్ని. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని కూటమిలో ఏ పార్టీలో చేర్చుకోవద్దని మూడుపార్టీల సమన్వయ కమిటీ నిర్ణయించిందని, ఆ ప్రకారం మాజీ ఎంపీ నాని ఉంటే ఆయన చేరికకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో నాని గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు ఆయన టీడీపీలో తిరిగి చేరేందుకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీయే కాదు కూటమిలో ఏ పార్టీలో చేరాలన్నా, నానికి ఇబ్బందేనని చెబుతున్నారు.
