కేశినేని బ్రదర్స్.. అసలు తగ్గట్లేదుగా..?
ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య విభేదాలు ఇప్పుడు లీగల్ మలుపు తీసుకున్నాయి.
By: Tupaki Desk | 25 April 2025 6:09 PM ISTవిజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య విభేదాలు ఇప్పుడు లీగల్ మలుపు తీసుకున్నాయి. ఇటీవల కేశినేని చిన్ని, తన సోదరుడు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తన పరువు భంగం కలిగించాయని ఆరోపిస్తూ రూ. 100 కోట్లు నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై మాజీ ఎంపీ కేశినేని నాని గట్టిగా స్పందించారు.
లీగల్ నోటీసులపై స్పందిస్తూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను పదేళ్లపాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, ఆ కాలంలో జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రతతో విధులు నిర్వహించానని పేర్కొన్నారు. తాను గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఈ లీగల్ నోటీసు కేవలం బెదిరింపు చర్యేనని నాని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నలు వేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే తాను మౌనంగా ఉండబోనని, దేనికోసం నిలబడాలో, దేనికి వ్యతిరేకంగా పోరాడాలో తనకు తెలుసని అన్నారు. తాను భయంతో కాకుండా వాస్తవాల ఆధారంగానే స్పందిస్తానని తేల్చి చెప్పారు. తన స్పందన మౌనంగా కాదని, బహిరంగంగా ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని నాని దృఢంగా చెప్పారు. "సత్యం బెదిరింపులకు లొంగదు, నేను కూడా లొంగను" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మొత్తమ్మీద కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసులపై కేశినేని నాని ఇచ్చిన ప్రతిస్పందనతో కేశినేని సోదరుల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
-సోదరుల మధ్య వివాదానికి కారణం ఇదే..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తున్న ప్రక్రియపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కు భూమి కేటాయించడాన్ని స్వాగతించారు. ఇది వేలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని, రాష్ట్ర అభివృద్ధికి అవసరమని ప్రశంసించారు. చంద్రబాబు దార్శనికతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అయితే, విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 60 ఎకరాల భూమిని కేటాయించడంపై మాత్రం మాజీ ఎంపీ నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖ ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించారని పేర్కొంటూ, ఈ వ్యవహారం వెనుక అక్రమాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉర్సా క్లస్టర్ సంస్థ ఏర్పాటు అయిన కొన్ని వారాలకే భారీగా భూమి కేటాయించడం, ఆ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులు అమలు చేయడానికి తగిన నేపథ్యం లేకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఐటీ సంస్థ భూ కేటాయింపుల వెనుక తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ప్రయోజనం ఉందని నాని సంచలన ఆరోపణ చేశారు. ఉర్సా క్లస్టర్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ చిన్నికి అత్యంత సన్నిహితుడని, కాలేజీలో కలిసి చదువుకున్నారని నాని తెలిపారు. గతంలో 21st సెంచరీ ఇన్వెస్ట్ మెంట్ మరియు ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో వీరిద్దరూ భాగస్వాములుగా ఉండేవారని, ఆ సంస్థ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందని ఆరోపణలున్నాయని గుర్తు చేశారు.ఉర్సా క్లస్టర్‌కు భూముల కేటాయింపు వెనుక కేశినేని చిన్ని హస్తం ఉందని, ఎంపీగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నాని ఆరోపించారు. విజయవాడలోనూ ఎన్నో అక్రమాలతో చిన్నికి సంబంధాలున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నేరుగా లేఖ రాసినట్లు, తన ఫేస్బుక్ అధికారిక అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు తెలిపారు.ఇదే సోదరుల మధ్య యుద్ధానికి కారణమైంది.
