Begin typing your search above and press return to search.

తానే పోటీ చేస్తానంటున్న అన్న.. మరి తమ్ముడి పరిస్థితి ఏంటి?

ఈ నేపథ్యంలో తాజాగా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయవాడ నుంచి టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానన్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 1:30 AM GMT
తానే పోటీ చేస్తానంటున్న అన్న.. మరి తమ్ముడి పరిస్థితి ఏంటి?
X

ఇటీవల కాలం వరకు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీపైన, సొంత పార్టీ నేతలపైన ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలోనూ సొంత పార్టీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఈ ఏడాది మే నెలలో రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు సైతం కేశినేని నాని హాజరు కాలేదు. అంతేకాకుండా ఇటీవల నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయవాడలో జరిగినా కేశినేని నాని స్థానిక ఎంపీగా ఉండి తొంగి కూడా చూడలేదు.

మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో రాసుకుపూసుకు తిరిగారు. కొద్ది రోజుల క్రితం నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌ రావుతో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో కేశినేని నేని పాల్గొన్నారు. ఆయన పనితీరు బాగుందని ప్రశంసలు కురిపించారు. అలాగే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తో కలసి అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తదితరులు కేశినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ టికెట్‌ ను టీడీపీ అధిష్టానం ఏ పిట్టల దొరకు ఇచ్చినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించి కలకలం రేపారు. టీడీపీ అధిష్టానం తనకు కాకుండా తన తమ్ముడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉండటంతో కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై పార్టీ చర్యలు తీసుకున్నా ఐ డోంట్‌ కేర్‌ అంటూ తేల్చిచెప్పారు.

విజయవాడ ఎంపీగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కేశినాని నాని విజయం సాధించారు. అయితే 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది కాలానికి పార్టీ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినాని నాని సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం బరిలో దించబోతోందని వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టే కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ నేతలతో భేటీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు.

ఈ పరిణామాలపై గతంలో కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వకపోయినా ఫరవాలేదని.. కేశినేని చిన్నికి మాత్రం ఇవ్వద్దని కోరారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ లో ఉన్నవారికి టికెట్‌ ఇవ్వవద్దన్నారు.

అయితే టీడీపీ అధిష్టానం కేశినేని నానిని పట్టించుకోవడం మానేసింది. పార్టీ పరిస్థితి బాగోనప్పుడు.. వైసీపీ హవా బలంగా ఉన్నప్పుడు కేశినేని నాని టీడీపీని ఇరుకునపెట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం, చంద్రబాబుపైన ధిక్కార స్వరం వినిపించడం పట్ల ఆ పార్టీ ఆగ్రహంతో ఉందని టాక్‌ నడిచింది.

మరోవైపు కేశినేని నాని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని పలుమార్లు ప్రకటించారు. అయితే తన సోదరుడు పేరు ఎత్తకుండా పరోక్షంగా అతడికి మాత్రం సీటు వద్దని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున కేశినేని చిన్నినే ఎంపీగా పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయవాడ నుంచి టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానన్నారు. అంతేకాకుండా తానే గెలుస్తానన్నారు. తాను గెలవడంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను సైతం గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాకుండా తాజాగా ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేయడాన్ని కేశినేని నాని ఖండించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం శాఖకు ఆయన ఎంపీ హోదాలో లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నిన్న మొన్నటిదాకా టీడీపీ అధిష్టానంపై ఘాటు విమర్శలు చేస్తూ.. సొంత పార్టీ నేతలను తిట్టిపోసిన కేశినేని నానిలో ఈ ఆకస్మిక మార్పుకు కారణమేంటో తెలియక టీడీపీ శ్రేణులు జుట్టు పీక్కుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తే మరి ఆయన సోదరుడు కేశినేని చిన్ని పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. నిన్నటి దాకా తాను పోటీ చేయనని చెప్పి ఇప్పుడు పోటీ చేస్తానంటే అందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది.