Begin typing your search above and press return to search.

'బ్లేజ్‌ వాడ'లో కేశినేని మరో కలకలం!

టీడీపీకి రాజీనామా చేయాలని కేశినేని నాని నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలోని తన కార్యాలయంలో ఇప్పుడు ఆయన సమూల మార్పులు మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:03 AM GMT
బ్లేజ్‌ వాడలో కేశినేని మరో కలకలం!
X

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేటర్‌ గా ఉన్న తన కుమార్తె శ్వేత సైతం కార్పొరేటర్‌ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనుందని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు.

టీడీపీకి రాజీనామా చేయాలని కేశినేని నాని నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలోని తన కార్యాలయంలో ఇప్పుడు ఆయన సమూల మార్పులు మొదలుపెట్టారు. తన కార్యాలయంలో టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించడం గమనార్హం.

విజయవాడ ఎంపీ టికెట్‌ ను వచ్చే ఎన్నికల్లో వేరే వ్యక్తికి ఇస్తామని ప్రకటించడంతోపాటు తిరువూరు సభ ఏర్పాట్లలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించినప్పటి నుంచి కేశినేని నాని రగిలిపోతున్నారు.

టీడీపీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే ఆయన ఆ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా విజయవాడలో తాను మూడోసారి పోటీ చేస్తానని, ఎంపీగా గెలుస్తానని వెల్లడించడం విశేషం. వైసీపీ ఆయనతో టచ్‌ లో ఉందని వైసీపీలో చేరతారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడలోని తన కార్యాలయంలో తాజాగా టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా తేటతెల్లమవుతోంది. కేశినేని నాని ఆగ్రహం నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ కేశినేని నానితో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆయనను శాంతపరచడానికి ప్రయత్నించారు. తిరువూరు సభకు కూడా రావాలని చంద్రబాబు తరఫున ఆహ్వానించారు. అయినప్పటికీ కేశినేని నాని జనవరి 7న జరిగిన తిరువూరు సభకు డుమ్మా కొట్టారు.

సాంకేతిక సమస్యతో ఎంపీ పదవికి తన రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని కేశినేని నాని.. కనకమేడలకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు కేశినేని నాని విజయవాడలోని తన కార్యాలయంలో అనుచరులతో మంతనాలు జరిపారు. తిరువూరులో జరిగిన టీడీపీ సభకు ఎంపీ కేశినేని నానితోపాటు ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, రామసుబ్బారావు, వాసన్‌ మునెయ్య, చెరుకూరి రాజేశ్వరరావు, దేవభక్తుని సీతారాం ప్రసాద్, జక్కె వెంకటేశ్వరరావుతో పాటు తదితరులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం.