Begin typing your search above and press return to search.

వైసీపీని కేశినేని నాని ఇరికించేస్తున్నారా?

విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని తన పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 May 2025 9:55 AM
Kesineni Nani A Headache for YSRCP
X

విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని తన పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరుడు, సిట్టింగు ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నితో విభేదిస్తున్న మాజీ ఎంపీ నాని కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా మడమ తిప్పని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పోరాటంలో భాగంగా మాజీ ఎంపీ నాని తన సొంత పార్టీకి చికాకు తెప్పించేలా వ్యవహరిస్తు్న్నట్లు చర్చ జరుగుతోంది.

విజయవాడ ఎంపీగా రెండు సార్లు పనిచేసిన కేశినేని నాని.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తన తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ నాని.. తన కార్యాలయం వద్ద పార్టీ జెండాలను కూడా తీసివేయించారు. మరోవైపు ఆయన మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒకసారి, బీజేపీతో టచ్ లోకి వెళ్లారని మరోసారి ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తోసిపుచ్చిన మాజీ ఎంపీ నాని.. ఇటీవల కాలంలో తన సోదరుడు, విజయవాడ ఎంపీ చిన్ని టార్గెట్ గా పలు విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ చిన్ని అనుచరులకు విశాఖలో 60 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించి దుమారం రేపారు.

విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కు 60 ఎకరాలు కేటాయించారని, అయితే ఆ కంపెనీకి ఊరూ పేరు లేదని, అదో బినామీ కంపెనీ అంటూ మాజీ ఎంపీ నాని బయటపెట్టిన తర్వాతే ఈ విషయాన్ని వైసీపీ అందిపుచ్చుకుంది. అలా తన పార్టీకి మంచి కంటెంట్ ఇచ్చిన నాని.. కొద్ది రోజుల్లోనే తలనొప్పి తెచ్చేలా మారిపోయారని అంటున్నారు.

నేరుగా మాజీ ఎంపీ నాని నుంచి వైసీపీకి ఇబ్బంది లేకపోయినా, ఆయన చేస్తున్న ఓ ఆరోపణ మాత్రం పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తుందని అంటున్నారు. ఏపీ మద్యం స్కాంలో విజయవాడ ఎంపీ చిన్నికి కూడా భాగస్వామ్యం ఉందని, ఏ1 నిందితుడు రాజ్ కేసిరెడ్డితో కలిసి సూటు కేసు కంపెనీల ద్వారా డబ్బు విదేశాలకు తరలించారని మాజీ ఎంపీ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఈడీకి కూడా లేఖ రాశారు.

అయితే ఇదే విషయం వైసీపీకి ఇబ్బందులు తెస్తోందని అంటున్నారు. అసలు మద్యం స్కాం జరగలేదని వైసీపీ వాదిస్తుండగా, స్కాం జరిగిందనే విషయాన్ని నిర్ధారిస్తున్నట్లు మాజీ ఎంపీ ప్రకటనలు ఇవ్వడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందంటున్నారు. స్కాంలో నిందితులు అంతా పార్టీతో సంబంధం ఉన్నవారు కావడం, వారితో వ్యాపార భాగస్వామ్యాన్ని లింకు చేస్తూ విజయవాడ ఎంపీకి కూడా స్కాంలో పాత్ర ఉందని మాజీ ఎంపీ వాదిస్తుండటంతో ఆయన వాదనను ఎలా సమర్థించాలో తెలియక వైసీపీ తలపట్టుకుంటోందని అంటున్నారు.తన తమ్ముడితో విభేదాలు ఉంటే వేరే పద్ధతిలో చూసుకోవాలని, కానీ లిక్కర్ స్కాంలోనూ ఆయన ప్రమేయం ఉందని చెప్పడం వల్ల స్కాం జరిగిందని పార్టీ నేతలే అంగీకరించినట్లు అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.