రాజ్ కసిరెడ్డిని కలిసింది నిజమే : ఎంపీ కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు
ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డితో తనకు పరిచయం ఉందని, నాలుగుసార్లు కలిశానని గుర్తు చేసుకున్నారు.
By: Tupaki Desk | 8 May 2025 9:57 AMకేశినేని సోదరుల మధ్య కొనసాగుతున్న వివాదం తీవ్ర ఆరోపణలు, సవాళ్లతో కొత్త మలుపు తిరిగింది. ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న కేసిరెడ్డి రాజ్‌తో ఎంపీ కేశినేని చిన్నికి ఉన్న సంబంధాలపై ఎంపీ కేశినేని నాని చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డితో తనకు పరిచయం ఉందని, నాలుగుసార్లు కలిశానని గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టాలని అనుకున్నామని, దానిని అభివృద్ధి చేద్దామని ప్రణాళిక వేసుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ అభివృద్ధి సహా ఆరు నెలల పాటు అన్ని ఖర్చులను తానే భరించానని వెల్లడించారు. అయితే, రాజ్ కేసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను కూడా వదిలేసి రాజ్ కేసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ కేసు డైవర్షన్‌పై కూడా చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 3200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని ఆరోపించారు. ఆ ప్యాలెస్‌లో రాజ్ కేసిరెడ్డితో సహా నలుగురికే ప్రవేశం ఉందని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ లిక్కర్ వ్యవహారం నుండి దృష్టి మళ్లించడానికి ఐదుగురు సమావేశమయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నారని సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని రెండు కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వస్తున్న వార్తలను నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని, అన్నీ లీగల్‌గానే ఉన్నాయని స్పష్టం చేశారు.
తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నానని, దీనికి 24 గంటల సమయం పడుతుందని అన్నారు. రూ. 3600 కోట్లు దోచేసిన జగన్ సీబీఐ విచారణకు సిద్ధమా అని చిన్ని సవాల్ విసిరారు. కేశినేని నాని, జగన్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నానని, ఆ ఆరోపణలను నిరూపించాలని ఎంపీ చిన్ని డిమాండ్ చేశారు.
మొత్తంగా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనపై మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇస్తూనే, రాష్ట్రంలో జరిగినట్టు చెబుతున్న లిక్కర్ స్కామ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై నేరుగా యుద్ధం ప్రకటించి, సీబీఐ విచారణకు సవాల్ విసరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.