రూ.350 కోట్ల మట్టి మాఫియా.. విజయవాడ ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ నాని సంచలన ఆరోపణలు
విజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ అయిన కేశినేని బ్రదర్స్ మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
By: Tupaki Political Desk | 23 Jun 2026 1:46 PM ISTవిజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ అయిన కేశినేని బ్రదర్స్ మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కొద్దిరోజులుగా ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ నానిపై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరు అన్నదమ్ముల మధ్య సోషల్ మీడియా వేదికగా వాగ్యుద్దం నడిచింది. ఈ క్రమంలోనే ఎంపీ చిన్ని రూ.350 కోట్ల రూపాయల విలువైన మట్టి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ నాని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి ఫిర్యాదు చేయడం పెను సంచలనం సృష్టిస్తోంది.
గత కొంతకాలంగా కేశినేని చిన్నిపై నాని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా, ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలకు వెళ్లడం ద్వారా నాని తన పోరాటాన్ని పదును పెట్టారు. ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, మైనింగ్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని నాని ఆరోపిస్తున్నారు. ఈ మట్టి కుంభకోణం వెనుక భారీగా నల్లధనం చేతులు మారుతోందని, దీనిపై లోతైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈడీని కోరారు. కేవలం 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అక్రమంగా తరలించారని మాజీ ఎంపీ నాని ఆరోపిస్తున్నారు. పోలవరం కాలువను ఏకంగా గుల్ల చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కుంభకోణంలో ఎంపీ చిన్ని మాస్టర్ మైండ్ అయితే ఆయన అనుచరులు రకరకాల బాధ్యతలు చూస్తున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్లు, రవాణా, క్యాష్ హ్యాండర్లు అంటూ పలువురి పేరుతో మాజీ ఎంపీ ఈడీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మాఫియాను ప్రశ్నించినందుకు కోటూరు తాడేపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త జమాలయ్యపై దారుణంగా దాడి చేశారు. కాలువ గట్లను పూర్తిగా తవ్వేయడంతో గ్రామాలు విపత్తుకు గురయ్యే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఈ అవినీతిపై వార్తా కథనాలు వచ్చాయని తెలియజేశారు. అదేసమయంలో రావూరి విస్టాలోని ఫ్లాట్ 301పై తక్షణమే ఈడీ దాడులు జరపాలని, బినామీ ఖాతాలన్నింటినీ స్తంభింపజేయాలని డిమాండ్ చేస్తున్నాన్నట్లు మాజీ ఎంపీ నాని ట్వీట్ చేశారు.
కాగా, ఎంపీ చిన్ని విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానని మాజీ ఎంపీ నాని చెబుతున్నారు. గతంలో ఎంపీ కార్యాలయానికి సంబంధించి రూ. 27 కోట్ల నల్లధనం మాయమైందని, ఆ వ్యవహారంలో కొందరు వ్యక్తులపై దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, నియోజకవర్గంలో బినామీ కంపెనీల ద్వారా భూకబ్జాలకు పాల్పడుతున్నారని, గతంలోనే రాష్ట్రంలోని లిక్కర్ స్కామ్‌తో చిన్నికి సంబంధాలు ఉన్నాయని నాని అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
కేవలం ఆర్థిక నేరాలే కాకుండా, తన సన్నిహితులను పోలీసు యంత్రాంగం ద్వారా వేధిస్తున్నారని కూడా నాని ఆరోపిస్తున్నారు. తన మిత్రుడు తాతినేని రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి, నిబంధనలకు విరుద్ధంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ, దీనిపై ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారు. అర్థరాత్రి వేళల్లో పోలీసు దాడులు జరిపించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఎంపీపై ‘మట్టి తవ్వకాలు, గ్యాంబ్లింగ్ నిర్వహణపై మాజీ ఎంపీ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాని చేస్తున్న ఆరోపణలను చిన్ని వర్గం ఖండిస్తూనే, ఆయనపై కౌంటర్ కేసులు నమోదు చేయిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, నాని వరుసగా ఈడీకి ఫిర్యాదు చేయడం, మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లడం వంటి చర్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ దర్యాప్తు సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది.
