పట్టుకొచ్చి కాల్చేశారా? ప్రజాసంఘాల అనుమానం!
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటరుపై ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 24 May 2025 11:10 AM ISTమావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటరుపై ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చత్తిస్ గఢ్ లోని అబూజుమడ్ అడవుల్లో ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటరులో కేశవరావుతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటరుపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత కేశవరావు భౌతికఖాయాన్ని ఇప్పటికీ కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై ఆయన మరణంపై ప్రజాసంఘాల వారు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేశవరావుకు రక్షణగా కనీసం 50 మంది సాయుధ మావోయిస్టులు ఉంటారని, కానీ ఎన్‌కౌంటరులో 27 మంది మరణించడంతో ఆయనను పట్టుకొచ్చి కాల్చిచంపేశారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు విడుదల చేసిన ఫొటోను చూసి కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన గడ్డం చేసుకోకపోవడం, తలకు రంగువేసుకున్నట్లు కనిపించడం, తల కింద ఎర్రదస్తీ ఉండటంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన దస్తీ ఎప్పుడూ అలా వాడరని, కొత్తగా కట్టినట్లు ఉందని గతంలో కేశవరావుతో కలిసిపనిచేసిన వారు చెబుతున్నారు. ఇక కేశవరావును పడుకోబెట్టిన ప్రదేశంలో ఆకులను గమనిస్తే ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంగా అనిపించడం లేదని అంటున్నారు. మావోయిస్టు దళపతితోపాటు చనిపోయిన ఇతర మావోయిస్టుల ఫొటోలను చూస్తుంటే అత్యంత సమీపం నుంచే కాల్పులు జరిపినట్లు ఉందని, వారి ముఖాలపై తుపాకీ బాయ్ నెట్ తో కొట్టినట్లు గుర్తులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
కేశవరావుతోపాటు మధు తప్పనిసరిగా ఉంటాడని, ఈ ఇద్దరికి రక్షణగా ఉండాల్సిన వారి విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కేశవరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని చికిత్స తీసుకుంటుండగా, పట్టుకొచ్చి కాల్చిచంపారన్న ఆరోపణలు వినినిపిస్తున్నాయని అంటున్నారు. అంతేకాకుండా కేశవరావు పదేళ్లపాటు దండకారుణ్యంలోని అబూజ్ మడ్ లోని ఒకే ప్రాంతంలో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఐదు నెలలుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ నెల 21న దాడి చేసినట్లు మరో చర్చ జరుగుతోంది. మొత్తానికి కేశవరావు అతి విశ్వాసమే ఆయనను దెబ్బతీసిందని అంటున్నారు. మరోపైపు ఆయన మృతదేహం కోసం ఇప్పటికీ కుటుంబ సభ్యలు ఎదురుచూస్తున్నారు. మరణించి మూడు రోజులు అవుతున్నా మృతదేహం అప్పగించకపోవడంపై భద్రతాదళాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
