బీజేపీ ఇంట్లో 'సిపిజె' జెండా.. సిజెఐ 'బొద్దింక' పురాణం.. నేటి పొలిటికల్ కామెడీ డ్రామా!
దేశ రాజకీయాల్లో కామెడీకి.. ఊహించని ట్విస్టులకు కొదవే లేదు. ఒకవైపు సొంతింట్లోనే విపక్షాల నినాదాలు మార్మోగుతుంటే మరోవైపు న్యాయస్థానంలో 'బొద్దింకల' చర్చ హాట్ టాపిక్‌గా మారింది.
By: A.N.Kumar | 25 July 2026 3:00 PM ISTదేశ రాజకీయాల్లో కామెడీకి.. ఊహించని ట్విస్టులకు కొదవే లేదు. ఒకవైపు సొంతింట్లోనే విపక్షాల నినాదాలు మార్మోగుతుంటే మరోవైపు న్యాయస్థానంలో 'బొద్దింకల' చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అస్సాంలో చోటుచేసుకున్న ఒక పరిణామం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అస్సాం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కేశబ్ మహంత కుమార్తె దిబిస గువాహటిలో నిర్వహించిన సీజేపీ నిరసనల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రి గారింట్లో మూడో కన్ను.. 'డాడీ ఓవైపు, కూతురు ఈవైపు
రాజకీయాల్లో "వ్యక్తిగత స్వేచ్ఛ" అనే పదానికి అస్సాంలో సరికొత్త అర్థం దొరికింది. అస్సాం ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, అసోం గణ పరిషత్ నాయకుడు కేశబ్ మహంత గారు హాయిగా ఆఫీసులో కూర్చుని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నారేమో గానీ ఆయన ముద్దుల కూతురు దిబిస మాత్రం రోడ్డెక్కి "మోదీ గారూ.. ధర్మేంద్ర ప్రధాన్ గారూ.. రాజీనామా చేయాల్సిందే " అని గళమెత్తారు.
అసలు సీన్ ఏంటంటే
గువాహటిలో సీజేపీ నిర్వహించిన నిరసనల్లో మంత్రి గారి కూతురు చాలా యాక్టివ్‌గా పాల్గొని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చేశారు. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీజేపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.
పగలేమో నాన్న గారు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవిని వెలగబెడతారు.. రాత్రికేమో కూతురు గారు అదే ప్రభుత్వానికి రాజీనామా డిమాండ్ చేస్తారు. "ఇంటింటి రామాయణం" అంటే ఇదేనేమో. పాపం కేశబ్ మహంత గారు లేదా ఆయన పార్టీ ఇప్పటివరకు ఈ అంశంపై నోరు విప్పలేదు. బహుశా "ఇంట్లో పిల్లలు కాస్త తుంటరివాళ్లు లేండి " అని కవర్ చేసుకునే పనిలో ఉన్నారేమో!
బొద్దింకలు.. లా డిగ్రీలు. చీఫ్ జస్టిస్ క్లారిటీ
ఇక రెండో అంశానికి వస్తే.. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇటీవల 'బొద్దింకలు' హల్‌చల్ చేశాయి. అయ్యో నిజమైన బొద్దింకలు కాదండోయ్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు నోటివెంట వచ్చిన ఆ ఒక్క మాట సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఆయన ఈ విషయంలో ఒక మైండ్ బ్లోయింగ్ క్లారిటీ ఇచ్చారు. నేను అన్నది ఎవరినో తెలుసా? "నేను పవిత్రమైన విద్యార్థులను లేదా అమాయక యువతను బొద్దింకలు అనలేదు బాబోయ్. నకిలీ డిగ్రీలతో, ఏ గుర్తింపు లేకుండా లాయర్ కోట్లు తొడుక్కుని తిరిగే కొందరు మహానుభావులను ఉద్దేశించి మాత్రమే ఆ మాట అన్నాను" అని స్పష్టం చేశారు. అసలు పిటిషన్ కాగితం చేతిలో లేకుండానే అత్యవసర విచారణ జరిపేయాలని లాయర్లు తొందరపడితే "నా సమయాన్ని వృథా చేయొద్దు" అనక ముద్దు పెట్టుకుంటారా ఏంటి? అని ప్రశ్నించారు. నా మాటలను సందర్భం నుంచి కట్ చేసి.. సోషల్ మీడియాలో రీల్స్ చేసి నన్ను ట్రోల్ చేశారని చీఫ్ జస్టిస్ కాస్త బాధపడ్డారు.
ఒకవైపు మంత్రి గారి కూతురు సర్కారుపై తిరుగుబాట పట్టి వార్తల్లో నిలిస్తే.. మరోవైపు సిజెఐ గారు తన "కాక్రోచ్" కామెంట్లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద ఈ రెండు ఘటనలు చూస్తుంటే మన దేశంలో 'రాజకీయం' , 'న్యాయం' రెండూ రోజురోజుకూ చాలా సరదాగా మారిపోతున్నాయని స్పష్టమవుతోంది.
