Begin typing your search above and press return to search.

హృదయవిదారకం.. ఆకలికి తాళలేక పిల్లిని పీక్కుతిన్న యువకుడు!

కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండులో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 5:02 AM GMT
హృదయవిదారకం.. ఆకలికి తాళలేక పిల్లిని పీక్కుతిన్న యువకుడు!
X

కేరళలో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. కొన్నిరోజులుగా తిండిలేక అలమటిస్తున్న ఓ యువకుడు ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయిన పిల్లిని పీక్కుతిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారడంతో ఈ విషయం వెలుగుచూసింది.

కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండులో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పిల్లిని పీక్కుతుంటున్న యువకుడిని చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడికి ఆహారం అందించి అతడి వివరాలు తెలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అస్సాంలోని ధుబరీ జిల్లాకు చెందిన ఆ 27 ఏళ్ల యువకుడు అక్కడే ఒక కాలేజీలో చదువుతున్నాడు. అయితే ఇంట్లో ఏం జరిగిందో కానీ ఇంట్లోవారికి చెప్పకుండా రైల్లో కేరళకు వచ్చేశాడు.

తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో అయిదురోజులుగా ఏమీ తినలేకపోయాడు. దీంతో ఆకలి బాధతో విలవిల్లాడాడు. ఈ క్రమంలో చనిపోయిన ఓ పిల్లి కనిపించడంతో ఆకలితో ఉన్న అతడు వెనుకా ముందు ఆలోచించలేదు. దాని మాంసాన్ని పచ్చిగానే పీక్కుతింటూ స్థానికులకు కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతడి కుటుంబ సభ్యులను ఫోన్‌ లో సంప్రదించి సమాచారం ఇచ్చారు. ఆ యువకుడికి ఆహారం అందించి కోజికోడ్‌ ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి తరలించారు.

ఆ వ్యక్తి పచ్చి పిల్లి మాంసం తినడం చూసి చూపరులు భయభ్రాంతులకు గురయ్యారని పోలీసులు తెలిపారు. వెంటనే మలప్పురంలోని తమకు సమాచారం అందించారని వెల్లడించారు. గత ఐదు రోజులుగా తాను భోజనం చేయడం లేదని ఆ వ్యక్తి చెప్పడంతో ఆహారం అందించామన్నారు. ఆ వ్యక్తిని అస్సోంకు చెందిన దేబోజిత్‌ రాయ్‌ గా గుర్తించామని చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని.. పిల్లిని తింటుండటంతో విపరీతమైన దుర్వాసన వచ్చిందని.. దీంతో సమీపంలోని దుకాణదారులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.

కాగా ఆ వ్యక్తి రెండేళ్ల క్రితమే తన సొంత రాష్ట్రాన్ని వదిలి కేరళ చేరుకున్నాడని సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. తాము ఫోన్‌ నంబర్‌ సేకరించి అతని సోదరుడిని చెన్నైలో గుర్తించామని చెప్పారు. తాము అతనిని సంప్రదించినప్పుడు, తన సోదరుడు దేబోజిత్‌ రాయ్‌ కొన్ని సంవత్సరాల క్రితమే తప్పిపోయాడని తెలిపాడన్నారు. రాయ్‌ మానసిక అనారోగ్యంతో ఉన్నాడని అతడి సోదరుడు చెప్పాడన్నారు. ఈ నేపథ్యంలో బాధితుడిని తదుపరి పరీక్షల కోసం కోజికోడ్‌ మానసిక ఆసుపత్రికి తరలించారు.