Begin typing your search above and press return to search.

కేరళ పేలుళ్ల ఘటన... ఇంట్లో సైన్స్ ప్రయోగం అనుకుంటే బాంబు తయారు చేశాడు!

గల్ఫ్‌ లో కొన్నేళ్లు ఫోర్‌ మెన్‌ గా పనిచేసిన మార్టిన్... ఎలక్ట్రిక్ సర్క్యూట్‌ లో మెలుకువలు నేర్చుకున్నాడంట! ఈ క్రమంలో తన కుటుంబంతో ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటున్నాడు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 9:16 AM GMT
కేరళ పేలుళ్ల ఘటన... ఇంట్లో సైన్స్  ప్రయోగం అనుకుంటే బాంబు తయారు చేశాడు!
X

ఆదివారం కేరళలో జరిగిన పేలుళ్ల ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుళ్ల అనంతరం కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యింది.. ఎన్ఐఏ రంగంలో దిగింది.. దీని వెనుక ఏమైనా ఉగ్రకుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైందని తెలిసింది! ఈ నేపథ్యంలో... ఈ పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు డొమినిక్ మార్టిన్ ఆ పనిని ఎలా చేసిందీ పోలీసులకు వివరించాడు.

అవును... కేరళ వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు డొమినిక్ మార్టిన్ (48) ఈ బాంబులను ఎలా తయారు చేసింది, ఆ సంఘంలోనే ఎందుకు పేల్చింది, ఆ బాంబు తయారీకి అయిన ఖర్చు మొదలైన వివరాలను వెల్లడించాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్‌ (యూట్యూబ్!)లో చూసి బాంబులను తయారు చేసినట్టు వెల్లడించిన డొమినిక్ మార్టిన్... ఈ బాంబుల తయారీకి రూ.3,000 ఖర్చు చేసినట్టు అంగీకరించాడు!

గల్ఫ్‌ లో కొన్నేళ్లు ఫోర్‌ మెన్‌ గా పనిచేసిన మార్టిన్... ఎలక్ట్రిక్ సర్క్యూట్‌ లో మెలుకువలు నేర్చుకున్నాడంట! ఈ క్రమంలో తన కుటుంబంతో ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. అయితే... ఈ పేలుళ్ల కోసం రెండు నెలల కిందటే గల్ఫ్ నుంచి కేరళకు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ప్రాధమిక దర్యాప్తులో టిఫిన్ బాక్స్ లలో భారీ పేలుడు పదార్థం ఐఈడీ కారణంగానే ఇది జరిగిందని తెలిపిన సంగతి తెలిసిందే!

ఈ నేపథ్యంలో... ఈ భారీ పేలుడు పదార్ధం ఐఈడీని తన ఇంటిలోనే తయారుచేసినట్టు డొమినిక్ మార్టిన్ తెలిపాడు. అనంతరం... మూడు రోజుల పాటు జరిగిన జెహోవా సమ్మేళనానికి హాజరయ్యేవారిని చంపడమే లక్ష్యంగా కన్వెన్షన్ హాల్‌ లోనే పేలుడు పదార్థాలను అమర్చినట్టు వివరించాడని తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు షాకవుతున్నారని అంటున్నారు. ఎంత ఎలక్ట్రిక్ ఎక్స్ పర్ట్ అయితే మాత్రం ఇంట్లో బాంబులు తయారుచేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారంట.!

అయితే లొంగిపోయే ముందు మార్టిన్ సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. అందులో ఈ సంస్థ బోధనలను తప్పుపట్టాడు! ఇందులో భాగంగా... సంస్థ బోధనలు విద్రోహపూరితమైనవి ఉన్నాయని.. సమాజం, ప్రజలు, పిల్లలకు తప్పుడు విలువలను బోధిస్తుందని ఆరోపించాడు. అందువల్లే వరుస పేలుళ్లకు పాల్పడాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాడట!

ఈ విషయాలపై స్పందించిన పోలీసులు... "నిందితుడు యూట్యూబ్‌ లో చూసి పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నాడు. కొచ్చిలో ముడిసరకులను కొని, ఇంట్లోనే తయారు చేశాడు. కుటుంబ సభ్యులు అవి సైన్స్‌ ప్రయోగాలు అనుకున్నారు. అనంతరం... కన్వెన్షన్‌ సెంటర్‌ లో రెండు కుర్చీల కింద పేలుడు పదార్థాలను నిందితుడు ఉంచి, రిమోట్‌ కంట్రోల్‌ తో పేలుళ్లు జరిపాడు" అని పోలీసు వర్గాలు తెలిపాయి.

కాగా... ఎర్నాకుళం జిల్లా కలమసేరిలో ఆదివారం క్రైస్తవ ప్రార్థనల్లో మూడు వరుస పేలుళ్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది గాయపడ్డారు!