Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు గొలుసులు కట్టి కుక్కల్లా నడిపించిన ప్రైవేటు కంపెనీ

పని తీరు సరిగా లేదన్న ఆరోపణలతో కుక్కల మాదిరి ఉద్యోగులకు గొలుసులు కట్టి.. కుక్కల మాదిరి నడిపించటమే కాదు.

By:  Tupaki Desk   |   6 April 2025 2:00 PM IST
ఉద్యోగులకు గొలుసులు కట్టి కుక్కల్లా నడిపించిన ప్రైవేటు కంపెనీ
X

ఈ ఉదంతం గురించి తెలిస్తే.. మనం రాతి యుగంలో ఉన్నామా? అన్న భావన కలిగేలా చేస్తుంది. కేరళలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన షాకింగ్ గా మారింది. ఎంత ప్రైవేటు సంస్థ అయితే మాత్రం సరిగా పని చేయని ఉద్యోగులను ఇంత దారుణ శిక్ష విధిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పని తీరు సరిగా లేదన్న ఆరోపణలతో కుక్కల మాదిరి ఉద్యోగులకు గొలుసులు కట్టి.. కుక్కల మాదిరి నడిపించటమే కాదు. చిల్లర నాణెలు విసిరి.. వాటిని నోటితో తీయించిన దుర్మార్గం వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వీడియోలు టీవీ చానళ్లలో టెలికాస్టు కావటంతో ఈ అంశం పెను సంచలనంగా మారింది. ఈ వీడియోలపై కేరళ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే స్పందించిన కార్మిక శాఖ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు కంపెనీ మీద తక్షణమే విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని చెప్పారు. దీంతో.. పోలీసులు ఈ కంపెనీమీద విచారణ షురూ చేశారు.

ఉద్యోగుల్ని తీవ్ర వేధింపులకు గురి చేసిన ఈ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు మీడియా ఎదుట వచ్చారు. సదరు ఉద్యోగి సైతం దారుణ శిక్షకు గురైన వీడియోలో ఉన్న వారే కావటం గమనార్హం. తమ కంపెనీలో వేధింపులు లేవని.. టీవీలో టెలికాస్ట్ అయిన వీడియో కొన్ని నెలల క్రితం నాటిదని పేర్కొన్నారు. అప్పట్లో మేనేజర్ గా ఉన్న వ్యక్తి తమ చేత బలవంతంగా అలా చేసి షూట్ చేశారన్నారు.

ఈ విషయం యాజమాన్యం వరకు వెళ్లటంతో అతడ్ని తొలగించారని.. ఆ కోపంతో ఇప్పుడు అతడు ఈ వీడియోల్ని బయటపెట్టి.. కంపెనీని ఇబ్బందికి గురి చేస్తున్నట్లు తెలిపాడు. కార్మిక శాఖ అధికారుల ముందు కూడా సదరు ఉద్యోగి ఇదే వాంగ్మూలాన్ని ఇవ్వటం గమనార్హం.

మరోవైపు.. ఈ సంస్థకు చెందిన మరికొందరు ఉద్యోగులు మాత్రం.. మార్కెటింగ్ ఉద్యోగులు తమ పని తీరు సరిగా చూపని కారణంగా ఈ తరహా శిక్షలు విధించిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. టార్గెట్లు సాధించక ఫెయిల్ అయిన వారికి ఇలాంటి శిక్షలు విధించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. ఈ ఉదంతంపై హైకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఈ అంశంపై కేసు నమోదు చేసింది. మొత్తంగా ఈ వ్యవహారం కేరళలో ఇప్పుడు సంచలనంగా మారింది.