Begin typing your search above and press return to search.

చివరి 'నిమిషా'లు.. హూతీల యెమెన్‌లో ఉరికి-ఊపిరికి మధ్య కేరళ నర్సు!

నిమిషాను కాపాడాలని భారత్‌ ప్రయత్నాలు సాగిస్తున్నా.. వారితో దౌత్య సంబంధాలు లేవు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 July 2025 9:11 PM IST
చివరి నిమిషాలు.. హూతీల యెమెన్‌లో ఉరికి-ఊపిరికి మధ్య కేరళ నర్సు!
X

గల్ఫ్‌లో యెమెన్‌ అని ఒకదేశం.. ఒమన్‌ అని ఒక దేశం...! రెండూ పక్కపక్కనే.. వరల్డ్‌ మ్యాప్‌లో చూస్తే రెండూ ఒకేలా కనిపిస్తాయి కూడా..! పేర్లు కూడా కాస్త దగ్గరగానే ఉన్నాయి..! అయితే, అభివృద్ధిలో మాత్రం రెండు దేశాలకు చాలా తేడా ఉంది. యెమెన్‌ పూర్తిగా వెనుకబడి ఉంది. ఒమన్‌ మాత్రం దూసుకెళ్తోంది. సగం యెమెన్‌ దేశాన్ని హూతీ మిలిటెంట్లు పాలిస్తున్నారు. వీరెవరో కాదు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన, గల్ఫ్‌లో అమెరికా నౌకలపై దాడిచేసిన మిలిటెంట్లు. హమాస్‌, ఇరాన్‌కు మద‍్దతుదారులు. ఇలాంటివారి ప్రభావం ఉన్న ప్రాంతంలో మన కేరళకు చెందిన మహిళా నర్సు ఉరికి ఊపిరికి మధ్య వేలాడుతున్నారు.

ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా.. ఓ కేరళైట్‌ ఉంటారనేది వాడుకలో ఉన్న మాట. అలా యెమెన్‌ వెళ్లారు కేరళ నర్సు నిమిషాప్రియ. అయితే, ఆమె బిజినెస్‌ పార్ట్‌నర్‌ను హత్య చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. అది మరణ శిక్షకు దారితీసింది. ఈ నెల 16న దానిని అమలు చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిమిషాకు చివరి నిమిషంలో అయినా ఊరట లభిస్తుందా..? లేక మరణశిక్ష తప్పదా? అనేది ఉత్కంఠగా మారింది.

యెమెన్‌లో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి ప్రెసిడెన్షియల్‌ కౌన్సిల్‌. దీనిని భారత్‌ సహా చాలా దేశాలు గుర్తించాయి. మన దేశం దౌత్య సంబంధాలు కూడా నెరుపుతోంది. రెండోది హూతీ రెబెల్స్‌ సుప్రీమ్‌ పొలిటికల్‌ కౌన్సిల్‌. రెండూ సమాంతరంగా నడుస్తుంటాయి. కాగా నిమిషాను ట్రయల్‌ కోర్టు దోషిగా నిర్ధారించి మరణ శిక్ష వేసింది. హూతీల పాలనలోని సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ దీనికి రెండేళ్ల కిందటే ఆమోదం తెలిపి. ప్రపంచ దేశాలు గుర్తించిన ప్రభుత్వ అధ్యక్షుడు రషద్‌ అలఅలిమి దీనిపై ఆమోద ముద్ర వేశారనే కథనాలూ కూడా వచ్చాయి. ఢిల్లీలోని యెమెన్‌ ఎంబసీ మాత్రం ఈ కేసును హూతీల ఆధీనంలోని ప్రభుత్వం డీల్‌ చేస్తోందని తెలిపింది.

నిమిషాను కాపాడాలని భారత్‌ ప్రయత్నాలు సాగిస్తున్నా.. వారితో దౌత్య సంబంధాలు లేవు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నిమిషా.. తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తి (బిజినెస్‌ పార్ట్‌ నర్‌) హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే, కొంత మొత్తం పరిహారం (బ్లడ్‌ మనీ) చెల్లిస్తే ఈ కేసు నుంచి బయటపడేందుకు యెమెన్‌ చట్టాలు అనుమతిస్తాయి. ఇందుకోసమే నిమిషా తల్లి ప్రేమకుమారి నిరుడు అక్కడకు వెళ్లారు. బ్లడ్‌ మనీ ఇచ్చి కుమార్తెను రక్షించుకునే ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయాయి.

ప్రేమకుమారి రూ.34.20 లక్షలను (40 వేల డాలర్లు) సమీకరించారు. అయితే, మృతుడి కుటుంబంతో చర్చల కోసం భారత ఎంబసీ ఏర్పాటుచేసిన లాయర్‌ అబ్దుల్‌ ఆమిర్‌ 20 వేల డాలర్లు అడిగారని ఆమె చెబుతున్నారు. మరోవైపు తలాల్‌ కుటుంబం ఎంత డిమాండ్‌ చేసిందో కానీ.. నిమిషా కుటుంబం ఏకంగా రూ8.5 కోట్లు చెల్లిస్తామని కూడా ప్రతిపాదించినట్లు సమాచారం.

సినిమాలో చూపినట్లు.. నిమిషా ఉరి చివరి నిమిషాల్లో అయినా ఆగుతుందేమో చూద్దాం..!