Begin typing your search above and press return to search.

ఏ 'నిమిషా'నికి ఏమి జరుగునో? 16న ఉరి.. 14న సుప్రీంలో విచారణ

చట్టం కంటే అరాచకం ఎక్కువగా ఉండే హూతీల పాలనలోని యెమెన్ లో ఉరికి ఊపిరికి మధ్య కొట్టుమిట్టాడుతున్న కేరళ నర్సు నిమిషా ప్రియ కేసులో అనూహ్య పరిణామం..

By:  Tupaki Desk   |   10 July 2025 1:26 PM IST
ఏ నిమిషానికి ఏమి జరుగునో? 16న ఉరి.. 14న సుప్రీంలో విచారణ
X

చట్టం కంటే అరాచకం ఎక్కువగా ఉండే హూతీల పాలనలోని యెమెన్ లో ఉరికి ఊపిరికి మధ్య కొట్టుమిట్టాడుతున్న కేరళ నర్సు నిమిషా ప్రియ కేసులో అనూహ్య పరిణామం.. భారత దౌత్య కార్యాలయం ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగానే... మరోవైపు నిమిషా వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

కేరళలోని పాలక్కాడ్ కు చెందిన నర్సు నిమిషా ప్రియ 2008లో యెమెన్ వెళ్లారు. 2011లో వివాహం చేసుకున్నారు. యెమెన్ చట్టాల ప్రకారం స్థానికుల భాగస్వామ్యంతోనే వ్యాపారం చేయాలి. దీంతో తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తి పార్ట్ నర్ షిప్ లో అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ ను నెలకొల్పారు. ఇప్పుడు ఈ తలాల్ మెహదీని హత్య చేసిన కేసులోనే నిమిషా ఉరి శిక్షను ఎదుర్కొంటున్నారు.

కాగా, భర్త, కుమార్తె స్వదేశానికి వెళ్లాక మెహదీ నుంచి నిమిషాకు వేధింపులు మొదలయ్యాయి.

పాస్ పోర్టు లాక్కొని..

నిమిషా నుంచి మెహదీ పాస్ పోర్ట్ లాక్కున్నట్టు కథనం. ఆమె 2017లో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మెహదీకి మత్తమందు ఇచ్చారని.. అది డోస్ ఎక్కువై మెహదీ చనిపోయాడని కథనం. ఈ కేసులో నిమిషాకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నెల 16న దానిని అమలు చేయనుంది. ఇప్పటికే గత ఏడాది నిమిషా తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లి.. ’బ్లడ్ మనీ’ (బాధితులకు పరిహారం ఇచ్చి కేసు లేకుండా చూసుకోవడం)కి అంగీకరించారు. ఈ ప్రయత్నాలు కొలిక్కిరాలేదు.

నిమిషాకు మరొక్క ఆరు రోజుల్లో ఉరి శిక్ష అనగా గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ నెల 14న విచారణ జరగనుంది. పిటిషన్ లోని అంశాల ప్రకారం.. నిమిషాకు మరణ శిక్ష తప్పించేందుకు దౌత్య మార్గాన్ని అనుసరించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, నిమిషాకు 16న ఉరి శిక్ష అమలు ఉండగా.. రెండు రోజుల ముందు దౌత్య చర్చలు ఏమాత్రం ఫలిస్తాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.