రోడ్డు సరిగా లేకపోవడంతో టోల్ చెల్లించడానికి నిరాకరించిన యువకుడు.. 9 గంటలు టోల్ గేట్‌ను దిగ్బంధించాడు!
"గతుకుల రోడ్డుకు టోల్ ఎందుకు?" ఈ ప్రశ్నతో కేరళకు చెందిన ఓ యువకుడు చేసిన శాంతియుత నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 5 July 2025 9:00 PM IST"గతుకుల రోడ్డుకు టోల్ ఎందుకు?" ఈ ప్రశ్నతో కేరళకు చెందిన ఓ యువకుడు చేసిన శాంతియుత నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాలక్కాడ్ జిల్లాలోని పన్నియంకర టోల్ ప్లాజా వద్ద సినిమా కెమెరామెన్ అయిన శెంటో వి. అంటో దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు టోల్ చెల్లించకుండా నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు.
- గతుకుల రహదారులపై వ్యతిరేకత
శెంటో తరచుగా పాలక్కాడ్ నుండి ఎర్నాకులం, త్రిశ్శూర్ వంటి దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో ఉన్న జాతీయ రహదారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రయాణాలు మరింత కష్టతరంగా మారాయని, ముఖ్యంగా గర్భవతైన తన సోదరిని తీసుకెళ్లినప్పుడు రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు.
-హైకోర్టు వ్యాఖ్యలకు స్ఫూర్తి
ఇటీవల కేరళ హైకోర్టు కూడా జాతీయ రహదారుల సంస్థ (NHAI)పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తగిన రహదారి సౌకర్యం కల్పించలేకపోతే టోల్ వసూలు చేయవద్దని కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని శెంటో తన నిరసనకు కారణంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ టోల్ ఆపరేటర్లు తగిన వసతులు లేకున్నా వాహనదారులపై టోల్ భారం మోపుతూనే ఉన్నారని ఆయన విమర్శించారు.
-శెంటో శాంతియుత నిరసన
సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే శెంటో ఈసారి కొత్త పంథాలో నిరసన తెలిపారు. ఫాస్టాగ్‌ను రీచార్జ్ చేయకుండా ప్రశాంతంగా తన కారులో కూర్చుని "నేను సేవ పొందనప్పుడు అందుకు డబ్బు ఎందుకు చెల్లించాలి?" అని ప్రశ్నించారు. ఆయనను పంపించడానికి టోల్ సిబ్బంది పలుమార్లు అభ్యర్థించినా శెంటో తన పట్టుదల వీడలేదు. చివరికి, 9.5 గంటల నిరీక్షణ తర్వాత ఆయనను టోల్ చెల్లించకుండానే వెళ్లనివ్వాల్సి వచ్చింది.
- పెద్ద ఎత్తున చర్చలు.. సోషల్ మీడియా వైరల్
ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది వాహనదారులు కూడా టోల్-రోడ్ సేవల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టోల్ వసూలు చేసే సంస్థల బాధ్యతలపై, ప్రజల హక్కులపై ఈ సంఘటన విస్తృత చర్చకు దారితీసింది. శెంటో చూపిన ప్రశాంత నిరసన ప్రజాస్వామ్యంలో నిరసన ఎలా ఉండాలో చూపించే ఒక ఆదర్శప్రాయమైన ఉదాహరణగా నిలిచింది.
"సేవ లేకుంటే టోల్ ఎందుకు?" అనే శెంటో ప్రశ్న ఇప్పుడు ప్రతి ప్రయాణికుడి మనసులో మారుమోగుతోంది. రహదారి హక్కులు, ప్రభుత్వ బాధ్యతలపై ఇది ఒక కొత్త చైతన్యానికి నాంది కాబోతుందేమో వేచి చూడాలి!
