Begin typing your search above and press return to search.

కేరళ సర్కార్ సంచలనం...డిగ్రీ దాకా ఉచిత విద్య

ఉచిత విద్యను ఉన్నత స్థాయిలో సైతం అందించడం ద్వారా దేశంలో తొలి రాష్ట్రంగా కేరళ నిలుస్తోంది.

By:  Satya P   |   19 Feb 2026 9:01 AM IST
కేరళ సర్కార్ సంచలనం...డిగ్రీ దాకా ఉచిత విద్య
X

ఉచిత విద్యను ఉన్నత స్థాయిలో సైతం అందించడం ద్వారా దేశంలో తొలి రాష్ట్రంగా కేరళ నిలుస్తోంది. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ఈ ఉచిత విద్యా విధానం లేదు. పైగా ఉచిత విద్య అన్నది పక్కకు పోయి కార్పొరేట్ విద్యా విధానం అంతటా అమలు అవుతోంది. భారంగా ఫీజులతో పేదలు మధ్యతరగతి చదువుకు దూరం అవుతున్న వేళ కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్ లో ఈ మేరకు కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఉన్నత విద్యా రంగంలో :

ఇక తాజాగా 2026-27 బడ్జెట్‌లో కేరళ ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థులకు డిగ్రీ స్థాయి వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపింది. తద్వారా భారతదేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలుస్తోంది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు. ఈ విధమైన చొరవ ఉన్నత విద్యను మెరుగుపరచడం కోసమే అని ఆయన అన్నారు. అంతే కాదు ఈ ఉచిత విద్యా విధానం డిగ్రీ స్థాయిలో ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కోర్సులకు సైతం వరిస్తుంది అని చెప్పారు.

ట్యూషన్ ఫీజులు రద్దు :

ఈ నిర్ణయం ద్వారా ఇక మీదట ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అంటే బీఏ బీఎస్సీ వంటి వాటికి ట్యూషన్ ఫీజులు రద్దు చేయబడతాయి. అంతటా ఫ్రీగానే ఎడ్యుకేషన్ అందిస్తారు అన్న మాట. ఇప్పటిదాకా చూస్తే కేరళలో 12వ తరగతి దాకా ఉచిత విద్య అందిస్తున్నారు. దాని పరిధిని గరిష్ట స్థాయికి విస్తరిస్తూ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఉచిత విద్యను అందించడం అన్నది పినరయి విజయన్ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెబుతున్నారు.

భారీ బడ్జెట్ తోనే :

ఇక దీనికి బడ్జెట్ ని భారీగానే కేటాయించారు. పేదలకు మధ్యతరగతి వర్గాలకు ఉన్నత స్థాయి విద్యను అందుబాటులోకి తేవాలని పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళను ముందుంచాలని ఉత్తమ సంకల్పంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అలా ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి విస్తృత ప్రయత్నంలో ఇది భాగంగా లెఫ్ట్ ప్రభుత్వ నేతలు చెబుతున్నారు ఇక చూస్తే 2026-27 బడ్జెట్ లో విద్యా పథకాలకు మొత్తం కేటాయింపులను 90.53 కోట్ల మేర పెంపు చేశారు. అలా మొత్తం 677.11 కోట్ల రూపాయలకు వాటిని అధికం చేశారు ఈ విధానం రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టిన తరువాత రూపొందించబడిందని చెబుతున్నారు. ఈ విధంగా కేరళ ప్రభుత్వం ఉచిత ఉన్నత విద్యను అందించడంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానం అనుసరిస్తే ఫీజుల భారం లేని విద్య అందరికీ దక్కుతుందని అంటున్నారు.