Begin typing your search above and press return to search.

కేరళలో ఈసీ ‘స్వీట్’ ప్రయోగం.. తొలిసారి ఓటర్లకు తోఫా

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.

By:  Garuda Media   |   31 March 2026 12:19 PM IST
కేరళలో ఈసీ ‘స్వీట్’ ప్రయోగం.. తొలిసారి ఓటర్లకు తోఫా
X

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈసారి జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రం కేరళ. గడిచిన ఎన్నికల వరకు ఆ రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ ఉండేది. ఒక పార్టీ ఒకదఫా అధికారంలో ఉంటే.. తర్వాతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి అధికారాన్ని అప్పగించే ధోరణి కేరళ ఓటర్లలో ఉండేది. అందుకు భిన్నంగా గత ఎన్నికల్లోనూ అధికార పార్టీకే అధికారాన్ని అందించారు కేరళ ఓటర్లు.

ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ నేత్రత్వంలోని యూడీఎఫ్ పక్కాగా ఎన్నికల్లో విజయం సాధిస్తుందని.. అధికారాన్ని సొంతం చేసుకుంటుందన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తన సర్వశక్తుల్ని ఒడ్డుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా.. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేరళలో కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు.. కేరళకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో విద్యావంతులు అత్యధికంగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరి ఎన్నికల హడావుడి భారీగా ఉండదు. బహిరంగ సభలు సైతం చిన్నగా ఉంటాయి. నేతల ప్రచార ఆడంబరాలు కూడా పరిమితంగా ఉంటాయి.

స్టార్ క్యాంపెయినర్ ప్రచారాలు సైతం పరిమిత స్థాయిలో ఉంటాయే తప్పించి.. మన దగ్గర మాదిరి భారీగా ఉండని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం వినూత్నంగా కేరళలో తొలిసారి ఓటుహక్కు లభించిన ఓటర్లకు వినూత్న కానుకను తీసుకొచ్చింది. ఓట్ స్వీటెన్డ్ కేరళ పేరుతో ఒక క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునే వారికి హల్వా పాకెట్లను అందచేస్తూ.. ఓటు వేయాలని కోరుతోంది.

ఈ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున హల్వా పాకెట్లను అందజేస్తున్నారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం వచ్చిన కొత్త ఓటర్లకు ఉత్సాహం కలిగించటమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశంగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఏఏ బూత్ లలో ఈ హల్వాపాకెట్లను తొలిసారి ఓటర్లకు అందజేయాలన్నది జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించి.. ఆ మేరకు ఆయా బూత్ లకు వీటిని పంపిణీ చేయనున్నారు. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వీట్ క్యాంపెయిన్ ఆసక్తికరంగానే కాదు.. ఓటు వేసే అంశాన్ని రోటీన్ కు భిన్నమైన ధోరణితో చెప్పిందని చెప్పాలి.