ఎర్ర పార్టీలకు రెడ్ సిగ్నల్ పడినట్లేనా ?
దేశంలో మినీ పోల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి.
By: Satya P | 30 April 2026 8:15 AM ISTదేశంలో మినీ పోల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే ఈ ఎన్నికల ఫలితాల మీద ఒక స్పష్టత అయితే వచ్చింది. దేశంలో మిశ్రమ ఫలితాలు వస్తాయని కూడా అర్ధం అయింది. కాంగ్రెస్ బీజేపీ తో పాటు డీఎంకేకు కూడా అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీకి బెంగాల్ లో సగానికి సగం చాన్స్ ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వామపక్షాలకు దేశంలో మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ. 2016 నుంచి అక్కడ వామపక్షాల నాయకత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బరిలోకి దిగినా ఎల్డీఎఫ్ కి అక్కడ ఈసారి చేదు ఫలితాలు వస్తాయని అంటున్నారు.
వరుసగా కూలుతున్నాయి :
ఇక చూస్తే దేశంలో ఒకనాడు ప్రబలంగా కనిపించిన వామపక్ష వైభవం కాస్తా ఇపుడు తగ్గుముఖం పడుతూ మరింతగా వెనక్కి పోతోంది. పశ్చిమ బెంగాల్ లో అప్రతిహతంగా వామపక్షాలు అధికారాన్ని చలాయించాయి. ఇపుడు చూస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకార్మ్ 4 శాతం ఓటు షేర్ దక్కుతోంది. సీట్లు ఏవీ దక్కే చాన్స్ లేదు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోరు సాగుతోఅంది. త్రిపురలో అయితే బీజేపీకి అధికారాన్ని వదిలిపెట్టి వామపక్షాలు విపక్షంలోకి వచ్చేశాయి. దాంతో ఇక మిగిలింది కేరళ మాత్రమే. అయితే ఇపుడు కేరళ కూడా టాటా చెబుతోంది. దాంతో వామపక్షాల పరిస్థితి ఏమిటి అన్న చర్చ ముందుకు వస్తోంది.
ప్రధాని పదవికి :
ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం దేశంలో వామపక్షాలు బలంగా ఉండేవి. తృతీయ ఫ్రంట్ రూపకల్పనలో చురుకైన పాత్ర పోషించాయి. ఆనాడు ప్రధాని పదవికి కూడా వామపక్ష అభ్యర్ధిని పరిశీలించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ సీఎం గా ఉన్న జ్యోతీ బసుని ప్రధానిగా ఎన్నుకోవాలని ఒక దశలో అంతా భావించారు. కానీ సీపీఈం వద్దు అనుకుంది. అది వేరే కధ. కానీ చెప్పొచ్చేది ఏంటి అంటే వామపక్షాల బలం అంతలా ఉండేదని. కనీసంగా యాభై నుంచి అరవై మంది దాకా ఎంపీలు ఉండేవారు. మొత్తం దేశంలోని ఎంపీలలో ఆ సంఖ్య పదవ వంతు కంటే ఎక్కువ. ఆ విధంగా ప్రతిభావంతమైన పాత్రను వామపక్షాలు పోషించాయి. కానీ నానాటికీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. ఇపుడు కేరళను కూడా నిలబెట్టుకోకపోతే ఇంతే సంగతులు అని అంటున్నారు.
గెలిస్తామని ధీమా :
అయితే ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం లేదని వామపక్ష నాయకులు అంటున్నారు. తాము తప్పకుండా గెలిచి తీరుతామని కూడా చెబుతున్నారు. మే 4న వచ్చే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని హ్యాట్రిక్ విజయం తమదేనని ఎల్ డీఎఫ్ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి ఆ ధీమా వెనక ఉన్న ధైర్యం ఏమిటో. నిజంగా కేరళలో మూడవసారి ఎల్డీఎఫ్ గెలిస్తే అది రికార్డే అవుతుంది.
