Begin typing your search above and press return to search.

కెరీర్ కోసం గర్భదారణ పక్కన... తెరపైకి షాకింగ్ విషయాలు!

మరోవైపు... గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో గర్భస్రావాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 Jun 2025 9:00 AM IST
కెరీర్  కోసం గర్భదారణ పక్కన... తెరపైకి షాకింగ్  విషయాలు!
X

ఇటీవల కాలంలో కెరీర్ కోసం అని, ఇంకా రకరకాల కారణాలు చెబుతూ గర్భదారణ విషయాన్ని చాలా మంది దంపతులు పక్కనపెడుతున్నారనే నివేదికలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాల్లో జననాల రేటు బాగా పడిపోయిందని, వృద్ధుల సంఖ్య పెరుగుతుందనే విషయంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దీంతో... పలు దేశాలు పిల్లలను కనాలంటూ దంపతులను ప్రోత్సహిస్తున్నాయి, పలు ప్రోత్సాహకాలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ సమయంలో.. అధిక అక్షరాస్యతతో పాటు తక్కువ శిశు, ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) తో భారతదేశంలో అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రంగా చాలా కాలంగా పేరుసంపాదించుకున్న కేరళ, ఇప్పుడు గణనీయమైన మార్పును చూస్తోంది.

అవును... ఇటీవల విడుదలైన 2023-24 ఆరోగ్య నివేదిక... రాష్ట్రంలో తగ్గుతున్న గర్భాల సంఖ్య, పెరుగుతున్న సిజేరియన్ సెక్షన్స్ రేట్లు, పెరుగుతున్న వృద్ధుల జనాభా వెరసి... ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ నమూనాకు కొత్త సవాళ్లను సూచిస్తుందని అంటున్నారు. ప్రధానంగా... కోవిడ్ తర్వాత ఈ అంకెల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

2019-20లో 5.28 లక్షల మంది గర్భిణీలుగా నమోదు చేసుకోగా.. ఆ సంఖ్య 2020-21 నాటికి 4.27 లక్షలకు తగ్గగా.. 2023-24లో 4.13 లక్షలకు పడిపోయింది. ఈ సందర్భంగా స్పందించిన ఓ అధికారి... నేటి దంపతుల్లో తక్కువ మంది పిల్లలను కనడం లేదా పిల్లలు వద్దనుకోవడం వంటి దృక్పథం పెరుగుతుందని.. ఫలితంగా గర్భధారణ రేటు తగ్గుతుందని తెలిపారు.

ఇదే సమయంలో... కేరళలో గర్భధారణలో పదునైన తగ్గుదలకు గల ప్రధాన కారణాల్లో... ఉన్నత విద్య స్థాయిలు, అభివృద్ధి చెందుతున్న కెరీర్ ప్రాధాన్యతలు, మారుతున్న జీవనశైలి, చిన్న కుటుంబాల వైపు స్పష్టమైన ధోరణి ఉన్నాయని వెల్లడించారు. ఈ మార్పు కరోనా మహమ్మారి తర్వాత స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు.

ఇదే క్రమంలో... ఇటీవల సగటు వివాహ వయస్సు పెరిగిందని.. ఇప్పుడు చాలా మంది మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి అనుకూలంగా గర్భధారణను ఆలస్యం చేస్తున్నారని.. విదేశాలకు వెళుతున్నవారు కేరళ వెలుపల స్థిరపడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఇది కూడా స్థానికంగా గర్భధారణ తగ్గుదలకు దోహదపడిందని మరో అధికారి వెల్లడించారు.

పెరుగుతున్న అబార్షన్లు!

మరోవైపు... గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో గర్భస్రావాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ఆకస్మిక గర్భస్రావాల కంటే ప్రేరేపిత గర్భస్రావాలు వేగంగా పెరుగుతున్నాయని అంటున్నారు. గర్భం దానంతట అదే ముగిసే పరిస్థితిని ఆకస్మిక గర్భస్రావం అంటారు. అలా కాకుండా గర్భధారణను ఉద్దేశపూర్వకంగా ముగించడాన్ని ప్రేరేపిత గర్భస్రావం అంటారు.

ఈ క్రమంలో... 2022-23లో మొత్తం గర్భస్రావాలు 25,686 కాగా.. వీటిలో 14,519 ప్రేరేపిత గర్భస్రావాలు ఉన్నాయి. ఇందులో 10,869 ప్రేరేపిత గర్భస్రావాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరిగయి. ఇదే సమయంలో... 2023-24లో జరిగిన 30,037 గర్భస్రావాలలో 20,179 ప్రేరేపిత గర్భస్రావాలు కాగా వాటిలో 14,825 ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగాయని చెబుతున్నారు.