'ఒక దేశం - ఒక భర్త'... కాంగ్రెస్ ట్వీట్ పై బీజేపీ ఫైర్!
అవును... ఒక దేశం, ఒక భర్త అంటూ కేరళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 31 May 2025 11:33 PM IST'ఒక దేశం - ఒక భర్త' అంటూ కేరళ కాంగ్రెస్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎగతాళి చేశారంటూ కేరళ బీజేపీ నేతలు మండిపడుతున్నారు! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారగా.. బీజేపీ నేతలు దీన్ని హిందూ ఆచారాలను అగౌరవపరచడంగా అభివర్ణిస్తున్నారు.
అవును... ఒక దేశం, ఒక భర్త అంటూ కేరళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితాన్ని వ్యంగ్యంగా తీసుకున్నట్లు కనిపించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది. ప్రధానంగా.. "ఒక దేశం" అనే పదంతో ఉన్న వివిధ కేంద్ర పథకాలను సూచించడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై స్పందించిన బీజేపీ... ఈ పోస్టు హిందువుల మనోభావాలు కించపరిచేలా, అవమానకరంగా ఉందని ఆరోపించింది. ఈ సందర్భంగా.. ఈ ట్వీట్ కేవలం రాజకీయం కాదని, ఇది హిందూ అచారాలపై దాడి, సిందూరం ధరించిన మహిళలను అవమానించదమే అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలోని లక్షలాది మహిళలకు సిందూరం ఎంతో పవిత్రమైందని తెలిపింది.
ఇదే సమయంలో... కేరళ కాంగ్రెస్ చేసిన ట్వీట్.. కాంగ్రెస్ పార్టీలోని భావజాలాన్ని ప్రతిబింబిస్తోందని బీజేపీ విమర్శించింది. ఈ క్రమంలో... ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ, క్రైస్తవ విస్వాసాలపై కాంగ్రెస్ నిరంతరం దాడులు చేస్తోందని.. గతంలోనూ శబరిమలను అపవిత్రం చేయడానికి వాపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రయత్నించిందని.. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించిందని బీజేపీ ఫైర్ అయ్యింది.
