సెన్సార్ బోర్డుతో కేరళ సీఎం ఢీ.. సొంతంగా సినిమాల రిలీజ్!
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా కేరళ మాత్రం ప్రత్యేకం. 40 ఏళ్ల కిందటే అక్షరాస్యతలో ముందంజ.. ఒకసారి ఒక పార్టీకే అవకాశం (ఇటీవల మినహా), సామాజిక చైనత్యం ఇలా దేనిలోచూసినా కేరళను చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాలి అన్నట్లుంటుంది పరిస్థితి.
By: Tupaki Desk | 18 Dec 2025 2:00 AM ISTభారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా కేరళ మాత్రం ప్రత్యేకం. 40 ఏళ్ల కిందటే అక్షరాస్యతలో ముందంజ.. ఒకసారి ఒక పార్టీకే అవకాశం (ఇటీవల మినహా), సామాజిక చైనత్యం ఇలా దేనిలోచూసినా కేరళను చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాలి అన్నట్లుంటుంది పరిస్థితి. అంతేకాదు.. ప్రకృతికి పెట్టింపేరు కేరళ. అందుకే గాడ్స్ ఓన్ కంట్రీగానూ పేరు తెచ్చుకుంది. ఇక ఇటీవలి కాలంలో కేరళ సినిమాలు దేశవ్యాప్తంగా చర్చనీయం అవుతున్నాయి. వైవిధ్యానికి పెద్ద పీట వేసే కేరళ సినిమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జాతీయ అవార్డులనూ కొల్లగొడుతున్నాయి. కేరళ నటులకు అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమల్లోనూ ప్రత్యేక స్థానం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీ ప్రాధాన్యతను గుర్తిస్తుంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారూ కేరళలో అధికమే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ బోర్డును సవాల్ చేస్తున్నారు.
పంచాయితీ మొదలు..
అసలే తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. కేరళను దశాబ్దాలుగా టార్గెట్ చేస్తున్న కమలం పార్టీ ఎంతకూ లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. సీపీఎం, కాంగ్రెస్ వేర్వేరు కూటములుగా ఏర్పడి మిగతా పార్టీలను కలుపుకొని పోతుండడమే దీనికి కారణం. ఎన్ని అంశాలను టేకప్ చేసినా కేరళలలో బీజేపీ పెద్దగా ప్రయోజనం పొందలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి పెద్ద బూస్ట్. పరిస్థితి చూస్తూ ఉంటే తమకు భవిష్యత్ లో ముప్పు తప్పదని భావించారో ఏమో.. కేరళ సీఎం పినరయి విజయన్ కాలుదువ్వుతున్నారు. దీనికి సెన్సార్ బోర్డు అంశాన్ని ఎంచుకున్నారు.
సెన్సార్ బోర్డు డోంట్ కేర్..
సీబీఎఫ్‌సీ పర్మిషన్ ఇవ్వకపోతేనేం..? అలాంటి సినిమాలను కేరళ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రిలీజ్ చేస్తామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ నియంత ధోరణులను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
ఇదీ మూల కారణం..
సీబీఎఫ్‌సీ ఇటీవల 19 సినిమాలకు నో చెప్పింది. సెన్సార్ సంగతి ఏమో కానీ.. ఇలా నో చెప్పడం వివాదంగా మారుతోంది. దీన్నే విజయన్ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాలను కేరళ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో రిలీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే, సీబీఎఫ్‌సీ వద్దన్న 19 సినిమాల్లో నాలుగు సినిమాలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ అనుమతిచ్చింది. మిగతా 15 సినిమాలను ప్రదర్శనకు రెండు వారాల ముందు జాబితా ఇవ్వనందునే అనుమతి ఇవ్వలేకపోయినట్లు వివరించింది.
