Begin typing your search above and press return to search.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్ల ఆఫర్‌... బీజేపీపై కేజ్రీ కామెంట్స్!

ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ఆశ చూపి, ఏడుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిందని కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 12:30 PM GMT
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్ల ఆఫర్‌... బీజేపీపై కేజ్రీ కామెంట్స్!
X

ప్రజాస్వామ్య భారతదేశంలో.. కండువాలు మార్చే నాయకులు, వారికి ఒక రేటు ఫిక్స్ చేసి తమలో కలిపేసుకునే పార్టీలు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేసేట్టు ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తర్వాత జరిగే ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పిన సంఘటనలు జరుగుతున్నా.. కొనుక్కునేవారిలో కానీ, అమ్ముడైపోతున్నవారిలో కానీ మార్పు రాకపోతుండటం గమనార్హం. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఒక రేటు ఫిక్స్ చేసిందంటూ కేజ్రీవాల్ సంచలన కామెంట్లు చేశారు.

అవును... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నించిందని.. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ఆశ చూపి, ఏడుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిందని కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. తాజాగా ఈ విషయాలపై సవివరంగా స్పందించిన కేజ్రీవాల్... సంచలన విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా.. కొద్ది రోజుల్లో కేజ్రీవాల్‌ అరెస్టు అవుతారని.. అందువల్ల ఎమ్మెల్యేలు విడిపోతారని.. ఈ క్రమంలో ఇప్పటికే 21 మందితో చర్చలు జరిపామని.. మరికొంతమందితోనూ మాట్లాడామని చెబుతూ.. తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు ఆడిందని కేజ్రీవాల్ వెల్లడించారు. ఇదే సమయంలో... తర్వాత ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. మీరు తమతో చేరితే రూ.25 కోట్లు ఇస్తాం.. వచ్చే ఎన్నికల్లో కమలం గుర్తుపైనే పోటీచేయొచ్చు అని బీజేపీ బీజేపీ పెద్దలు తమ ఎమ్మెల్యేలతో మాట్లాడారని అన్నారు.

దీంతో... తనను అరెస్టు చేసేది మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు కాదని.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు కుట్ర పన్నుతున్నారనే విషయం దీనిని బట్టి అర్థమవుతోందని.. ఇలాంటి ప్రయత్నాలు చేయడం బీజేపీ నేతలకు ఇదే మొదటిసారి కాదని.. గత 9 ఏళ్లలో వారు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశారని.. అయినప్పటికీ విజయం సాధించలేకపోయారని.. ప్రజల మద్దతు ఎప్పుడూ ఆప్ కే ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నారని.. అలా ఉండబట్టే వారంతా బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ ను తిరస్కరించారని.. ఈసారి కూడా వారి కుట్రలు భగ్నమవుతాయని కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు కేజ్రీవాల్.

కాగా... ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగానే ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆప్ నేతలు ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే... ఇదంతా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ పన్నిన కుట్రలో భాగం అన్నట్లుగా కేజ్రీవాల్ స్పందించారు.