Begin typing your search above and press return to search.

తీహార్‌ జైలులో కేజ్రీవాల్‌ పరిస్థితి ఇది!

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్ట్‌ అయినప్పటి నుంచి 4.5 కిలోల బరువు తగ్గినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి అతిషి తెలిపారు.

By:  Tupaki Desk   |   3 April 2024 9:38 AM GMT
తీహార్‌ జైలులో కేజ్రీవాల్‌ పరిస్థితి ఇది!
X

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. ఆయనకు ఏప్రిల్‌ 15 వరకు కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది, దీంతో కేజ్రీవాల్‌ ను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించారు.

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్ట్‌ అయినప్పటి నుంచి 4.5 కిలోల బరువు తగ్గినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి అతిషి తెలిపారు.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన అతిషి.. కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు, ఆయన ‘తీవ్రమైన డయాబెటిక్‌ పేషెంట్‌’ అని తెలిపారు. అయినప్పటికీ దేశం కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉంటారని కొనియాడారు.

కేజ్రీవాల్‌ బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోందని ఆతిషి వెల్లడించారు. బీజేపీ కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

అయితే, రెండు రోజుల క్రితం తీహార్‌ జైలుకు వచ్చినప్పటి నుండి కేజ్రీవాల్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు.

కేజ్రీవాల్‌ ఆరోగ్యం గురించి ఆందోళనలు అవసరం లేదని అంటున్నారు. తీహార్‌ జైలు అధికారులు కేజ్రీవాల్‌ బరువు 55 కిలోల వద్ద స్థిరంగా ఉందని వెల్లడించారు. అలాగే ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని నివేదించారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ తన దినచర్యలో భాగంగా తన సెల్‌ లో యోగా, ధ్యానం, వాకింగ్‌ చేస్తున్నారని తీహార్‌ జైలు అధికారులు చెబుతున్నారు.

కేజ్రీవాల్‌ షుగర్‌ పేషెంట్‌ కావడంతో నిత్యం ఆయన చక్కెర స్థాయిలను నిశితంగా పరిశీలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఆకస్మిక, విపత్కర పరిస్థితులు ఎదురయినా ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేశారు.

కేజ్రీవాల్‌కు ఇంట్లో వండిన భోజనాన్ని అందిస్తున్నారు. ఆయనను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురయితే ఆయన జైలుగది వద్ద వెంటనే ప్రతిస్పందించేలా ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

కాగా కేజ్రీవాల్‌ కస్టడీలో ఉన్న సమయంలో తన భార్యతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. అలాగే వ్యక్తిగతంగా తన న్యాయవాదిని కలిశారు.

కేజ్రీవాల్‌ ను విడుదల చేసినా, బెయిల్‌ ఇచ్చినా తమ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని నిర్ణయించింది.

కాగా కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. మధ్యంతర బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై తాజాగా విచారణ జరగనుంది. మరి కోర్టు ఏ తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.