Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ దూకుడు : డిఫెన్స్ లో బీజేపీ !

అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న అప్టూ డేట్ పాలిటిక్స్ తో ఎన్డీయే కూటమికి కొత్త ట్రబుల్స్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   20 May 2024 3:49 AM GMT
కేజ్రీవాల్ దూకుడు : డిఫెన్స్ లో  బీజేపీ !
X

అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న అప్టూ డేట్ పాలిటిక్స్ తో ఎన్డీయే కూటమికి కొత్త ట్రబుల్స్ వస్తున్నాయి. మొదటి మూడు దశల పోలింగ్ సమయానికి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన ఎన్నికల ప్రచార సభలలో మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా చెలరేగిపోతున్నారు.

తన అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలను తీసుకుని వచ్చిన ఆయన ఒక్కో దానిని పాశుపతాస్త్రం చేసి బీజేపీ మీద వరసగా సంధిస్తున్నారు. ఆయన రాకతో ఆయన ప్రచార ధాటితో ఇండియా కూటమికి సరికొత్త జోష్ వచ్చింది. అదే సమయంలో ఎన్డీయే కూటమి ఏపక్షంగా సాగించాలనుకున్న ప్రచారానికి గట్టి బ్రేకులు వేసినట్లు అయింది.

కొన్ని సందర్భాల్లో బీజేపీ డిఫెన్స్ కూడా పడుతోంది. కాషాయ దళం ఎపుడూ విపక్షాన్ని డిఫెన్స్ మోడ్ లో ఉంచి తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది. విపక్షాలు ఆ వ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేళ కాగల కార్యాన్ని బీజేపీ చక్కగా నెరవేర్చుకుంటుంది.

ఈసారి మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. బీజేపీని సక్సెస్ ఫుల్ గా డిఫెన్స్ లోకి నెట్టడంలో కేజ్రీవాల్ మంచి టాలెంట్ ని చూపిస్తున్నారు. ఆయన సంధిస్తున్న ప్రశ్నలు కానీ ఆయన చూపిస్తున్న దూకుడు కానీ అధికార ఎన్డీయే కూటమికి ఇబ్బందిగానే మారుతోంది.

నిజానికి 543 ఎంపీ సీట్లు ఉన్న దేశంలో ఆప్ పోటీ చేస్తున్నవి జస్ట్ 22 ఎంపీలు మాత్రమే. ఇక ఢిల్లీ పంజాబ్ లలో ఆప్ అధికారంలో ఉంది. గుజరాత్, యూపీ వంటి చోట్ల తన ప్రభావాన్ని బాగా చూపిస్తోంది. రెండేళ్ళ క్రితం జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి పోటీ చేసి ఏకంగా ఏడు శాతం ఓట్లను సాధించింది. ఈసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రంలోనే కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు.

ఇక ఆయన ఎన్నికల ప్రచారంతో బీజేపీ ఎంతో కొంత ఆత్మ రక్షణలో పడినట్లుగా తెలుస్తోంది. మోడీ అమిత్ షాల వల్ల బీజేపీలోని సీనియర్లు ఎలా ఇబ్బందులు పడ్డారు. ఎంత మది తెర వెనక్కి నెట్టబడ్డారు అన్నది కేజ్రీవాల్ సభలలో ఏకరువు పెడుతున్న తీరుతో బీజేపీలోనూ అలజడి రేపుతున్నారు. సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషీ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

అలాగే నితిన్ గడ్కరీ, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప సహ దేశంలోని సీనియర్ లీడర్లకు చాకచక్యంగా మోడీ షా ద్వయం పక్కన పెట్టగలిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాను గత ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని అప్పట్లో మోడీ మళ్ళీ గెలిస్తే అమిత్ షా దేశానికి హోం మంత్రి అవుతారు అని చెప్పాను అంటూ కేజ్రీవాల్ గుర్తు చేశారు.

ఈసారి మోడీని గెలిపిస్తే అమిత్ షా దేశానికి ప్రధాని అవుతారు అంటూ కేజ్రీవాల్ చేస్తున్న ప్రచారం బీజేపీ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ నే పూర్తిగా మలుపు తిప్పేసింది. దాంతో పాటుగా రాజ్ పుట్ వర్గాలను ఆయన వెనకేసుకుని వస్తున్నారు. ఆ వర్గానికి చెందిన యోగీని సీఎం పదవి నుంచి దించేస్తారు అని కూడా జోస్యం చెబుతున్నారు. దీంతో బలమైన రాజ్ పుట్ ఓట్లు ఇండియా కూటమి వైపుగా ట్రావెల్ కావడానికే అరవింద్ కేజ్రీవాల్ ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు అని అంటున్నారు.

దేశంలో బీజేపీని ఎదుర్కోనేది ఆప్ మాత్రమే అని అందుకే తమ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సడెన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నికల ప్రచారాన్ని కీలక మలుపు తిప్పిన కేజ్రీవాల్ క్రేజ్ ఉత్తరాదిన బాగా పెరిగిపోయింది. ఆయనను తమ సభలకు పిలిపించుకోవాలని కూటమి నేతలు తాపత్రయపడుతున్నారు.

అదే సమయంలో ఆయన రాకతో ఇండియా కూటమి గ్రాఫ్ కూడా పెరిగినట్లు అయింది. ఈసారి వచ్చేది ఇండియా కూటమే బీజేపీకి జస్ట్ రెండు వందల సీట్లు మాత్రమే అంటూ ఆయన చెబుతున్న జోస్యం కమలనాధులకు కలవరం రేపుతోంది. ఈ అరవిందుడిని ఎలా ఎదుర్కోవడం అన్నదే కమలనాధులకు ఇపుడు అతి పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఎన్నికల ముఖ చిత్రాన్ని కేజ్రీవాల్ మలుపు తిప్పుతున్నారని అంటున్నారు.