Begin typing your search above and press return to search.

బీజేపీలోకి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. ఏ రాష్ట్రంవాడంటే?

టీమ్ ఇండియాకు కొన్ని మ్యాచ్ లలో మంచి ఇన్నింగ్స్ ఆడిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు.

By:  Tupaki Desk   |   8 April 2025 5:46 PM IST
Cricketer Kedar Jadhav Begins New Innings in Politics
X

టీమ్ ఇండియాకు కొన్ని మ్యాచ్ లలో మంచి ఇన్నింగ్స్ ఆడిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ఎన్నికలు ఇప్పట్లో లేకున్నా.. తన భవిష్యత్ ను రాజకీయాల్లోనే అని నిర్ణయించుకున్నాడు. మొన్నటివరకు ఐపీఎల్ కూడా ఆడిన అతడు.. మంచి స్కోర్లు చేశాడు. ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్ లో లేకపోవడం, వయసు రీత్యా కూడా ఆలోచించి రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీమ్ ఇండియాకు 73 వన్డేలు ఆడడం అంటే పర్వాలేదు అనే అనుకోవాలి. అలాగే 9 టి20ల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు అతడు. ఈ నేపథ్యంలోనే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లో ఉపయుక్తమైన బౌలర్ గానూ బంతిని అందుకున్నాడు. కొన్ని మ్యాచ్ లలో బౌలింగ్ తోనూ గెలిపించాడు.

ఇదంతా కేదార్ జాదవ్ గురించి. తాజాగా అతడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే సమక్షంలో కాషాయ పార్టీ కండువా కప్పుకొన్నాడు జాదవ్.

కేదార్ స్వంత రాష్ట్రం మహారాష్ట్ర. ఐపీఎల్ లో కొచ్చి టస్కర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు కేదార్ జాదవ్ ప్రాతినిధ్యం వహించాడు.

2014లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన జాదవ్ 1,389 పరుగులు చేశాడు. 27 వికెట్లు కూడా పడగొట్టాడు. 2015లో టి20ల్లోకి అడుగుపెట్టి 9 మ్యాచ్ లలో 122 పరుగులు సాధించాడు. మంచి మిడిలార్డర్ బ్యాటర్. 2008లో దేశవాళీ క్రికెట్లోకి వచ్చాడు. 2023 వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. 40 ఏళ్ల జాదవ్ మహారాష్ట్రకు చెందినవాడు. ఆ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో చేరిన అతడు మున్ముందు ఎంత దూరం వెళ్తాడో చూడాలి.