Begin typing your search above and press return to search.

పెద్దాయన కేఈ కి గవర్నర్ యోగం ?

ఇక కేఈ క్రిష్ణమూర్తి రాయలసీమ వంటి రెడ్ల పెత్తనం ఉన్న చోట బీసీ గొంతుకగా నిలిచి దశాబ్దాల పాటు రాజకీయం చేయడం కూడా విశేషమే అంటారు.

By:  Tupaki Desk   |   17 July 2025 9:00 PM IST
పెద్దాయన కేఈ కి గవర్నర్ యోగం ?
X

కేఈ క్రిష్ణమూర్తి సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన కాంగ్రెస్ నుంచే తన రాజకీయ జీవితం మొదలెట్టారు. ఆయన చంద్రబాబు వైఎస్సార్ లాతో పాటే 1978లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా డోన్ నుంచి గెలిచి వచ్చారు. అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బాబు వైఎస్సార్ మంత్రులు అయ్యారు. కానీ కేఈ కి ఆ భాగ్యం దక్కలేదు. కానీ టీడీపీ ఆవిర్భావంతో అందులో చేరిన ఆయన వరసబెట్టి అనేక దఫాలుగా మంత్రి పదవిని నిర్వహించారు. అంతే కాదు 2014 నుని 2019 దాకా సాగిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సైతం పనిచేశారు.

ఇక కేఈ క్రిష్ణమూర్తి రాయలసీమ వంటి రెడ్ల పెత్తనం ఉన్న చోట బీసీ గొంతుకగా నిలిచి దశాబ్దాల పాటు రాజకీయం చేయడం కూడా విశేషమే అంటారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రతిష్ట ఉంది. దివంగత నాయకుడు మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డికి ఎదురు నిలిచి రాజకీయాలు చేశారు అన్న పేరు ఉంది.

ఇక 2019 తరువాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమారుడినే వారసుడిగా ప్రకటించారు. ఎనిమిది పదుల వయసులో ఉన్న కేఈ కి ఇపుడు రాజ్ భవన్ యోగం పట్టనుందా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో టీడీపీకి ఒక గవర్నర్ పదవిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలా ఓసీ క్షత్రియ సామాజిక వర్గం ఉత్తరాంధ్ర కు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా అవకాశం లభించింది.

తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారని అంటున్నారు. ఏపీకి గవర్నర్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మరో గవర్నర్ పదవిని కూడా బాబు కోరారు అని అంటున్నారు. ఈసారి బీసీకి ఆ పదవి ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు.

రాయలసీమకు చెందిన కేఈ వంటి పెద్దాయనకు ఈ పదవి ఇస్తే కనుక సామాజికంగా ప్రాంతీయంగా సమతూకం పాటించినట్లుగా ఉంటుందని అంతే కాకుండా రాజకీయంగా మేలు జరుగుతుందని భావిస్తున్నారుట. కేఈ వంటి పెద్ద మనిషికి అది సరైన గౌరవంగా కూడా ఆలోచిస్తున్నారుట.

దీనికి కేంద్రం కూడా అంగీకరించింది అని అంటున్నారు. ప్రస్తుతానికి ముగ్గురు గవర్నర్లను ప్రకటిస్తే ఏపీకి ఒకటి ఇచ్చారు. తొందరలోనే మరో దఫా గవర్నల నియామకాలు ఉంటాయని అంటున్నారు. అపుడు కచ్చితంగా చాన్స్ కేఈ కి ఇస్తారని చెబుతున్నారు. కేఈ చంద్రబాబులది యాభై ఏళ్ళ రాజకీయ అనుబంధం. అందుకే తన స్నేహితుడికి ఈ తీరున గౌరవించాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇక పార్టీలో మరో సీనియర్ నేత బీసీ నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు కూడా గవర్నర్ పదవి మీద ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయనను వచ్చే ఏడాది ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలలో ఒక దానికి ఎంపిక చేసి పెద్దల సభకు పంపుతారు అని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ బీసీల పార్టీ అని నిరూపించుకోవడంతో పాటు రాయలసీమలో రాజకీయంగా పట్టు సాధించేందుకు చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో అన్నీ వదిలేసి ప్రస్తుతం విశ్రాంతిని తీసుకుంటున్న కేఈ కి రాజయోగం పట్టనుందా అంటే అవును అనే అంతా అంటున్నారు.