Begin typing your search above and press return to search.

ఫాం హౌస్ లో కేసీఆర్ వండర్స్ తో ఉక్కిరిబిక్కిరి!

మొన్నటికి మొన్న ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో పాటు.. ఓడిన వారంతా రావటం.. ఆయనతో భేటీ కావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Dec 2023 3:59 AM GMT
ఫాం హౌస్ లో కేసీఆర్ వండర్స్ తో ఉక్కిరిబిక్కిరి!
X

ముఖ్యమంత్రికి మరేం పని ఉండదా? సమస్యలున్న ప్రజలు సీఎంను కలిస్తే ఏం ప్రయోజనం? ఊళ్లో ఉన్న అధికారుల వద్దకు వెళ్లాలి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలే కానీ ప్రగతి భవన్ కు రావాలనుకోవటమే పెద్ద తప్పు.. ఇలాంటి సిత్రవిచిత్రమైన సూత్రీకరణలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది మాత్రమే కాదు.. ఆయన మాటల్ని చిలకపలుకుల మాదిరి వల్లె వేసే మాజీ మంత్రి కేటీఆర్ నోటి నుంచి తరచూ వినిపించేవి. సమస్యలున్న సాదాసీదా ప్రజలు ముఖ్యమంత్రి నివాసం వరకు రావటమంటే.. వ్యవస్థలు ఫెయిల్ అయినట్లే అంటూ లాజిక్ లేని వాదనలు వినిపించే ఆయన.. ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన అవసరం ఏముందన్నట్లుగా మాట్లాడేవారు.

సాదాసీదా ప్రజల సంగతిని పక్కన పెడదాం.. మంత్రులు..ఎమ్మెల్యేలకు సైతం సారు దర్శనం ఇవ్వరెందుకు? అన్న ప్రశ్న అడిగితే.. అలా అడగటమే రాజద్రోహం అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడటం తెలిసిందే. అధికారం చేతిలో ఉన్నప్పుడు చెప్పిన సూత్రాలు.. అధికారం దూరమైనంతనే మాయం కావటం.. గడిచిన పదేళ్లో కనిపించని ఎన్నో సిత్రాలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్న వైనం ఆసక్తికరంగా మారింది.

ప్రగతిభవన్ లో కొలువు తీరే కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన మంత్రులు ముందుస్తుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందే తప్పించి.. సారు ఇంట్లో ఉన్నారని వస్తే మాత్రం.. తిరిగి పంపటమే తప్పించి లోపలకు అనుమతించే ధోరణి చాలా తక్కువగా ఉండటం తెలిసిందే. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే.. ఎమ్మెల్యేల పరిస్థితి మరెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సారు ఒక రూల్ పెట్టిన తర్వాత దాన్ని అందరూ ఫాలో కావాల్సిందే కదా? అలానే పదేళ్లుగా ఫాలో అవుతున్న వేళ.. అనూహ్యంగా అధికారం చేజారిన సందర్భంలో.. అంతకాలం తాను అనుసరించిన రూల్ ను విడిచేయటం ఆసక్తికరంగా మారింది.

మొన్నటికి మొన్న ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో పాటు.. ఓడిన వారంతా రావటం.. ఆయనతో భేటీ కావటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో విడుదలై.. వైరల్ గా మారటం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా అనధికార భేటీని అప్పటికప్పుడు అనుమతించే వైనం ఉండేది కాదు. అలాంటిది కేసీఆర్ మాత్రం తన వారిని కలిసేందుకు ఆసక్తిని చూపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ భేటీ ఏకంగా నాలుగు గంటల పాటు సాగటం విశేషం. ఈ సందర్భంగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రజలు ముఖ్యమంత్రి ఇంటికి రావాలని అనుకోవటం ఏమిటంటూ ప్రశ్నించిన గులాబీ ముఖ్యనేతల మాటలకు భిన్నంగా కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చేయటం.. వారందరికి కేసీఆర్ దర్శనం ఇవ్వటం.. వారికి అభివాదం చేయటం చూస్తే.. సరికొత్త సీన్ కు దిమ్మ తిరిగిపోవాల్సిందే. పదేళ్లు పవర్ లో ఉండి.. ఫాంహౌస్ లోకి ప్రజల్ని ఇంత భారీగా అనుమతించి.. వారి చేత జైజైలు కొట్టించుకున్న వైనం చూస్తే.. ఓడిన వేళ ఫాంహౌస్ లో ఇన్నేసి వండర్లు చోటు చేసుకుంటాయా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఓటమి ఎదురైన మూడు రోజులకే ఇంతలా మార్పులు వస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని చూడాల్సి వస్తుందో?