Begin typing your search above and press return to search.

కాలపరీక్ష నుంచి కేసీఆర్ కు మినహాయింపు ఉండదంతే

ఆచితూచి అడుగులు వేస్తుంటే.. వెంట ఉన్న సహాయకుడు జాగ్రత్తలు చెబుతూ.. ఆయన చేత అడుగులు వేయిస్తున్నారు. అది కూడా చేతికి సాయంగా ఉండే ఊతకర్ర సాయంతో.

By:  Tupaki Desk   |   18 Jan 2024 4:52 AM GMT
కాలపరీక్ష నుంచి కేసీఆర్ కు మినహాయింపు ఉండదంతే
X

కాలం కలిసి వచ్చినప్పుడు.. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు మనకు మించినోళ్లం లేదన్నట్లుగా మాట్లాడతాం. అయితే.. అదంతా కాల మహిమ తప్పించి.. మన గొప్పతనం ఏమీ ఉండదన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. తాజాగా బయటకు వచ్చిన కేసీఆర్ వీడియోను చూసినంతనే.. ఎలాంటి మనిషి ఎలా అయ్యారు? వడివడిగా అడుగులు వేసే కేసీఆర్.. ఈ రోజున ఒక అడుగు వేయటానికి ఎంతలా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు (మరింత కచ్ఛితంగా అంటే తొమ్మిదిన్నరేళ్లు) పాలించిన కేసీఆర్.. ఆయన వ్యవహరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజకీయ ప్రత్యర్థుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి. ఆచితూచి అడుగులు వేస్తుంటే.. వెంట ఉన్న సహాయకుడు జాగ్రత్తలు చెబుతూ.. ఆయన చేత అడుగులు వేయిస్తున్నారు. అది కూడా చేతికి సాయంగా ఉండే ఊతకర్ర సాయంతో.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం.. కొన్ని గంటల వ్యవధిలోనే ఫాంహౌస్ (ఫార్మర్ హౌస్) బాత్రూంలో కాలు జారి పడిన కేసీఆర్.. తుంటి ఎముక విరగటంతో ఆయన్ను యశోదా ఆసుపత్రికి తరలించటం తెలిసిందే. అక్కడే చికిత్స తీసుకున్న అనంతరం.. మెడికేషన్ లో భాగంగా ఫాంహౌస్ కు కాకుండా.. హైదరాబాద్ లోని నంది హిల్స్ లో ఉన్న పాత ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి.

మొన్నటివరకు బెడ్ మీదకే పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు బెడ్ మీద నుంచి కిందకు దిగి.. నాలుగు అడుగులు వేస్తూ.. నడిచే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద వయసు కావటం.. బలహీనంగా ఉండటం.. తుంటికి జరిగిన సర్జరీ కావటంతో గతంలో మాదిరి వేగంగా నడిచే వీలుండదు. తర్వాతి రోజుల్లో సెట్ అయినా.. ఇప్పటికిప్పుడైతే పాత జోరుకు ఛాన్సు లేదు. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ పాలనా రథాన్నిదౌడు తీయించిన పెద్ద మనిషి.. ఈ రోజున నాలుగు అడుగులు వేసేందుకు నానా తిప్పలు పడే ఈ వీడియో చూస్తే.. కాల మహిమా మజాకానా? అనుకోకుండా ఉండలేని పరిస్థితి.