Begin typing your search above and press return to search.

ఈసారికి బీజేపీతో కలిపి వెళదాం.. కేసీఆర్ పై కొత్త ఒత్తిడి?

నిజమే.. ఎప్పుడూ లేని రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సలహాలు.. సూచనలే కాదు.. ఒత్తిడి కూడా తెస్తున్న వైనం ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:45 AM GMT
ఈసారికి బీజేపీతో కలిపి వెళదాం.. కేసీఆర్ పై కొత్త ఒత్తిడి?
X

ఓటమి మహా చెడ్డది. ఎంతటోడినైనా సరే.. పలుచన చేసేస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభవాన్ని గులాబీ సారు సరికొత్తగా ఎదుర్కొంటున్నారా? అంటే అవునని చెబుతున్నారు. నిజమే.. ఎప్పుడూ లేని రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సలహాలు.. సూచనలే కాదు.. ఒత్తిడి కూడా తెస్తున్న వైనం ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది. అధినేత ఎదుట కూర్చునేందుకు సైతం సంశయించే కుటుంబ సభ్యులు సైతం ఈ మధ్యన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కు సూచనలు మీద సూచనలు చేస్తున్నారట.

పార్లమెంటు ఎన్నికల వేళ.. తమకున్న పరిమితుల గురించి ఆలోచించి అడుగులు వేయాలన్న మాటను కేసీఆర్ కు పదే పదే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపై ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీ సర్కారు మరోసారి అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు స్పష్టమవుతున్న వైనం.. మరోవైపు విపక్ష పార్టీగా ఎన్నికల్ని ఎదుర్కొనే తొలి సందర్భంలో.. వీలైనంత సేఫ్ గేమ్ ఆడాలన్నది పార్టీ ముఖ్యనేతల వాదనగా చెబుతున్నారు.

అయితే.. గులాబీ సారు ఆలోచనలు వేరుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం బాహాటంగా వ్యతిరేకించి.. ఇప్పుడు కలిసిపోతే విశ్వసనీయతకు ప్రమాదంగా మారుతుందని.. తర్వాతి కాలంలో పార్టీ ఉనికికి కొత్త కష్టం వస్తుందన్న వాదనతో పాటు.. వ్యక్తిగతంగా బీజేపీతో కలిసి వెళ్లే విషయంలో కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేదంటున్నారు.దీంతో.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రపోజల్ ను వారికి పంపే అంశంపై పెద్ద ఎత్తున తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

గతంలో ఎప్పుడూ ఎదురు కాని పరిస్థితులు తాజాగా గులాబీ పార్టీలో నెలకొన్నట్లుగా తెలుస్తోంది. విపక్షంలో ఉండి కోట్లాటడం.. అది కూడా తెలంగాణ సాధన కోసమే తప్పించి.. పార్టీ ఉనికి కోసం కాకపోవటంతో ఇప్పుడేం చెప్పి ఎన్నికల బరిలోకి వెళ్లాలన్నది ప్రశ్నగా మారిందని చెబుతున్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణ ప్రగతి కోసం ఓటు వేయాలని అడిగిన గులాబీ పార్టీ.. ఈ లోక్ సభ ఎన్నికల్లో తమకు ఓటు వేయటానికి కనీస కారణాలు చెప్పాల్సిన పరిస్థితితో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

అందుకే.. బీజేపీతో కలిసి వెళితే.. పొత్తుల్లో బాగంగా తక్కువలో తక్కువ నాలుగైదు సీట్లలో తమ ఉనికిని చాటొచ్చన్న వాదన వినిపిస్తోంది. అందుకు భిన్నంగా ఒంటరిగా వెళితే.. తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని గులాబీ బాస్ ముందు పెట్టగా.. ఆయన మాత్రం ససేమిరా అంటున్న వైఖరితో.. ఇప్పుడెలా ముందుకు వెళ్లాలన్నది ముఖ్యనేతల మాటగా మారిందంటున్నారు. దీంతో.. కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్న తీరు.. ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఏమైనా.. ఇలాంటి అనుభవం కేసీఆర్ కు కొత్తదిగా చెప్పక తప్పదు.