కాంగ్రెస్, బీజేపీకి కేసీఆర్ దెబ్బ!
కానీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని తాజాగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 29 Aug 2023 3:05 PM ISTఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి దెబ్బ కొట్టబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే, ఎన్నికల షెడ్యూలు రాకముందే 115 స్థానాల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, బీజేపీ పడిపోయాయి. గెలుపు గుర్రాలను ఆయా పార్టీలు వెతుక్కుంటున్నాయి. కానీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని తాజాగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ 115 స్థానాల్లో అభ్యర్థులనైతే ప్రకటించేశారు. కానీ ఇప్పుడు 30కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఆయన మార్చే అవకాశాలున్నాయని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో మరోసారి కేసీఆర్ సర్వే చేయిస్తున్నారని సమాచారం.
అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత, ఈ సారి గెలిచే ఛాన్స్ ఉందా? పరిస్థితి ఏమిటీ? అనే విషయాలపై సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వే నివేదిక వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్లు టాక్.
మొదట 115 స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో 7 తప్ప అన్ని చోట్ల సిట్టింగ్లకు కేసీఆర్ మళ్లీ అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల అభ్యర్థులపై కేసీఆర్ కు వ్యతిరేకత ఉందని తెలిసింది. కానీ ముందుగానే ఆయా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, ఇతరులకు టికెట్లు ఇస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రమాదం ఉండేది. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి ఆ నాయకులు వెళ్లేందుకు సిద్ధమయ్యే వాళ్లు. దీంతో ఆయా చోట్ల ఆ పార్టీల బలం పెరిగేదే.
అందుకే ముందుగానే ఆ దిశగా ఆలోచించిన కేసీఆర్.. వ్యూహం ప్రకారమే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేసీఆర్ కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశముందని తెలిసింది.
