Begin typing your search above and press return to search.

బాబు అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఖండన.. కేసీఆర్ మౌనం

తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం చంద్రబాబు అరెస్టు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:06 AM GMT
బాబు అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఖండన.. కేసీఆర్ మౌనం
X

తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం చంద్రబాబు అరెస్టు. ఉమ్మడి ఏపీలోకి తొమ్మిదేళ్లు, విభజిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడిని రూ.371 కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇదే అంశంపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. బాబు అరెస్టయిన మొదట్లోనే కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు జాతీయ నాయకులు స్పందించారు. వీరంతా ఎక్కువ శాతం ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందినవారే. అధికార ఎన్డీఏలో భాగమైన కొందరు నేతలు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు.

బీజేపీ సహా అందరూ స్పందిస్తూ..

మరో విషయం ఏమంటే ఏపీలో కొంత భిన్న పరిస్థితి నెలకొన్నా.. తెలంగాణకు చెందిన బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నాయకులు సైతం చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. తమిళనాడులో వైగో, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష కూటమి నేతలు తమ వైఖరిని తెలియజెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా..

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు 2018 ఎన్నికలకు ముందు నుంచి టీడీపీతో చెడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు 2018 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మహా కూటమి పేరిట తెలంగాణలో కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకొని రావడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. అయితే, తమ రాష్ట్ర వ్యవహరాల్లో చేయిపెట్టినందుకు.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆ ఎన్నికల్లో గెలుపు తర్వాత కేసీఆర్ వ్యాఖ్యానించారు. చివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం ఆయన వైసీపీకి ఇతోధికంగా సాయం చేసినట్లు కథనాలు వచ్చాయి.

ఇటీవల చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందన కనబరుస్తున్నారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు మొదలు ఉమ్మడి ఖమ్మంలో కందాళ ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు సహా పదిమంది వరకు ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. వనమా అయితే, శుక్రవారం కొత్తగూడెంలో నిరసన ర్యాలీలో కూడా పాల్గొన్నారు.

కేటీఆర్ సెటైర్.. కేసీఆర్ మౌనం..

చంద్రబాబు అరెస్టయిన మరుసటి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. అది చంద్రబాబు అరెస్టుపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉందనే భావన వచ్చింది. ఇక చంద్రబాబు విషయమై పార్టీ ఎమ్మెల్యేలు స్పందిస్తున్నా.. కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. అలాగని ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని కూడా ఆదేశాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో దీనివెనుక వ్యూహం ఏమై ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

కొసమెరుపు: అవినీతి జరిగిందా? లేదా? అనే విషయం పక్కనపెడితే.. చంద్రబాబు వంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడి అరెస్టుపై వివిధ వర్గాల వారు, వివిధ పార్టీల నాయకులు స్పందించారు. అయితే, వీరందరి కంటే కేసీఆర్ స్పందనే విలువైనదని చెప్పాలి. ఎందుకంటే.. 1983 నుంచి అంటే నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబును దగ్గరినుంచి చూసిన వ్యక్తి కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు కూడా. అందుకనే కేసీఆర్ స్పందనకు అంత విలువ. మరి ఆయన ఎప్పుడు నోరు విప్పుతారో?