Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ రోజూ మొరాయింపేనా? మరి విమానమో?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగాల శైలే వేరు.. ఆ ప్రవాహం.. అందులోని విమర్శలు.. ప్రత్యర్థులపై పంచ్ లు.. మరెవరికీ సాధ్యం కాదు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 11:39 AM GMT
సీఎం కేసీఆర్ హెలికాప్టర్ రోజూ మొరాయింపేనా? మరి విమానమో?
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగాల శైలే వేరు.. ఆ ప్రవాహం.. అందులోని విమర్శలు.. ప్రత్యర్థులపై పంచ్ లు.. మరెవరికీ సాధ్యం కాదు. పరిస్థితులను ముందే ఊహించి అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ ను మించిన నాయకుడు ప్రస్తుతం ఎవరూ లేరు. ఇక ఎన్నికల సమయంలో ఆయన పాల్గొనే ప్రచార సభలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. బీఆర్ఎస్ కు ఓ విధంగా ఆయన తిరుగులేని స్టార్ క్యాంపెయినర్. మంత్రులు హరీశ్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత వంటి వాగ్దాటి ఉన్న నాయకులు ఎందరున్నా కేసీఆర్ ముందు నిలవలేరు. కాగా.. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

ఒక రౌండ్ పూర్తి.. రెండో రౌండ్ కు సై

ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి చేశారు సీఎం కేసీఆర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాను రెండేసి సార్లు చుట్టివచ్చారు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియడంతో స్పీడ్ పెంచనున్నారు. గురువారం రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పలుచోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. తాజాగా రెండో విడత సభల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 13.. అంటే సోమవారం నుంచి ప్రచారానికి చివరి రోజైన 28 వరకు 54 సభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు.

గజ్వేల్ తోనే ముగింపు..

గతంలోలానే గజ్వేల్ సభతోనే సీఎం కేసీఆర్ తన ప్రచారాన్ని ముగించనున్నారు. ఈనెల 28న గజ్వేల్‌ సభ ఉంది. దాంట్లో పాల్గొనడం ద్వారా కేసీఆర్ మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన చేసినట్లవుతుంది. కాగా, తొలి విడతో కేసీఆర్ 30 నియోజకవర్గాల్లో సభలకు హాజరయ్యారు. అయితే, సుడిగాలి పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్‌ వినియోగిస్తున్న హెలికాప్టర్‌ తరచూ మొరాయిస్తోంది. ఐదు రోజుల కింద బీఆర్‌ఎస్‌ సభల కోసం బయలుదేరిన హెలికాప్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌజ్‌కు వెనుదిరిగారు సీఎం కేసీఆర్. మరో హెలికాప్టర్‌ తెప్పించుకుని ప్రయాణం కొనసాగించారు. ఇక బుధవారం కాగజ్‌ నగర్‌ లో ప్రజా ఆశీర్వాద సభకు హెలికాప్టర్‌ లో వెళ్లిన సీఎం.. అనంతరం ఆసిఫాబాద్‌ బయల్దేరబోయారు. కానీ హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ సభ ముగిసేలోపు పైలట్‌ హెలికాప్టర్‌ లో సాంకేతికలోపాన్ని సవరించి ఆసిఫాబాద్‌ తీసుకొచ్చారు. దీంతో కేసీఆర్‌ హెలికాప్టర్‌ లో బెల్లంపల్లి సభకు హాజరై, తర్వాత హైదరాబాద్‌ వచ్చారు.

విమానం కొంటామన్నారు ఏమైందో?

గత ఏడాది దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతోనే ఆ పార్టీ జాతీయ పార్టీ అని ప్రకటించారు. అనంతరం వచ్చిన ఊహాగానాల్లో దేశవ్యాప్తంగా పర్యటనలు, పార్టీ అభ్యర్థుల ప్రచారానికి సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్నారని. కథనాలు వచ్చాయి. కొందరైతే.. ఈ విమానాన్ని ఖమ్మంకు చెందిన నాయకులే కొనిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఇంతవరకు ‘‘బీఆర్ఎస్ విమానం’’ ఎగరలేదు. మరి లోక్ సభ ఎన్నికల నాటికైనా దానిని బయటకు తీస్తారా?