Begin typing your search above and press return to search.

పాపం... కేసీఆర్ ...!

అవును. పాపం కేసీఆర్ అని అంతా అంటున్నారు. ఎక్కడి కేసీఆర్ ఎలా అయిపోయారు అన్న చర్చ రాజకీయంగా సాగుతోంది

By:  Tupaki Desk   |   13 March 2024 2:30 PM GMT
పాపం... కేసీఆర్ ...!
X

అవును. పాపం కేసీఆర్ అని అంతా అంటున్నారు. ఎక్కడి కేసీఆర్ ఎలా అయిపోయారు అన్న చర్చ రాజకీయంగా సాగుతోంది. ఆయనను అపర చాణక్యుడు అని అంతా అంటారు. రాజకీయ గండర గండడు అని పేరు కూడా ఉంది. కానీ కేసీఆర్ ని ఒకే ఒక్క ఓటమి ఇలా మార్చేసింది అని అంటున్నారు.

నిజానికి చూస్తే కేసీఆర్ తెలంగాణా ఉద్యమాన్ని తీసుకుని వచ్చారు. ఇక తెలంగాణా ఉద్యమ కాలంలో ఎన్నో ఉప ఎన్నికలను కావాలని కేసీఆర్ తీసుకుని వచ్చారు. ఆయన కానీ ఆయన తరఫున ఎమ్మెల్యేలు కానీ రాజీనామాలు చేస్తే చాలు విపక్షాలకు తీరని గుబులు మొదలయ్యేది.

అలా ప్రతీ ఉప ఎన్నికలోనూ తనదైన వ్యూహం దట్టించి గెలిచేవారు. అంతేనా తెలెంగాణా ఉద్యమ కాలంలో ఆ ముసుగులో తన కుమారుడు కుమార్తెను రాజకీయ నేతలుగా తీర్చిదిద్దారు. ఇన్నీ చేసి ఉద్యమ కాలంలో చేయాల్సింది చేసి చివరికి కాంగ్రెస్ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంటూ ఇచ్చిన తెలంగాణాలో కేసీయార్ తాను రెండు సార్లు సీఎం గా అధికారాన్ని అందుకున్నారు.

ఒక విధంగా చూస్తే ఇది కూడా రాజకీయ చాకచక్యమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో తన టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి అలా కాకుండా సొంతంగా పార్టీని కొనసాగించి టూ టైమ్స్ సీఎం కావడం అంటే కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అది అని అంటున్నారు.

పోనీ సీఎం గా కేసీఆర్ పదేళ్ల పాటు రాజ్యం చేశారు. కానీ ప్రజల నాడి ఏమైనా ఆయనకు అందిందా ఆయన కనీసంగా పట్టుకోగలిగారా అంటే లేదు అని మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికలే నిరూపించాయి. అంతే కాదు తనకు సీఎం పదవి అంటే విపక్షంలో ఎవరూ అల్టర్నేషన్ లేరని సమ ఉజ్జీగా ఎవరూ తంతో నిలబడలేరని ఒక రకమైన భావనతో ఉండేవారు కేసీఆర్ అని అంటారు.

అలా అతి విశ్వాసమే కొంప ముంచి కేసీఆర్ ని ఈ రోజున మాజీ సీఎం గా చేసింది అని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ పాలన సంగతి పక్కన పెడితే రాజకీయమే ఎక్కువ చేశారు అన్న విమర్శలు ఉన్నాయి. రెండు ఎన్నికలు అపుడు జరిగితే రెండు సార్లూ విపక్షాలకు చెందిన పార్టీలను ఏకంగా విలీనం చేసుకుంటూ రాజకీయాన్ని పీక్స్ కి తీసుకెళ్ళిపోయారు అన్న అపకీర్తిని మూటగట్టుకున్నారు.

అసలు తెలంగాణాలో తన గులబీ పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉండరాదు అన్న పట్టుదలతోనే కేసీఆర్ ముందుకు సాగారని కూడా చెబుతారు. దాని కోసమే ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు అని కూడా అంటారు. ఇక తెలంగాణా వరకూ రాజకీయం ఓకే అనుకోకుండా జాతీయ స్థాయిలో నా అంత మేధావి ఎవరూ ఉండరనుకుని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అని పార్టీని పేరు మార్చి పెట్టారు

అచ్చొచ్చిన టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ ని పెట్టారు. దానికి ఆ పార్టీలోనే అందరూ వద్దు అని అన్నా కూడా మాట వినకుండా చేసి మరీ బొక్క బోర్లా పడ్డారు అని చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ పదేళ్ల కేసీఆర్ జమానాలో ఒప్పులుగానే సాగిపోయాయి.కానీ ఒక్కసారి ఓటమి పాలు అయ్యాక ఇపుడు కాంగ్రెస్ ఆయనకు టోటల్ సినిమా చూపిస్తోంది అని అంటున్నారు.

కాళేశ్వరంలో దారుణమైన తప్పులు జరిగాయని కూడా కచ్చితంగా వెలికి తీసి మరీ కాంగ్రెస్ బయటపెడుతోంది. మేడిగడ్డ పగుళ్ళు కూడా జనాల ముందు పెడుతోంది. ఇక గులాబీ పార్టీ స్కీముల వెనక ఉన్న స్కాములు అలా బయటకు వస్తున్నాయి. ఏదో అనుకున్న కాంగ్రెస్ తన సత్తా చాటుతూ ఒక రకంగా ఇరగదీస్తోంది. ఇవే కాదు ధరణి పేరుతో ఎలా వాడుకున్నారో కూడా ఆ లోగుట్టుని బయటేసి తొందరలో కాంగ్రెస్ జనాల ముందు పెట్టబోతోంది అని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఎంపీ ఎన్నికల్లో సరైన అభ్యర్ధులు లేక బీఆర్ఎస్ చాలా ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో వేల కోట్లు సంపాదించిన నాయకులు అంతా ఇపుడు ముఖం చాటేస్తున్నారు. మరి వాళ్ళంతా తప్పుకుంటున్నారు అంటేనే కేసీఅర్ కి ఈ పాటికి సినిమా అర్ధం కావాలని కానీ ఈ రోజుకీ అర్ధం అయినట్లుగా లేదని అంటున్నారు.

అసలు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న నాయకులే ఏ పార్టీకి అయిన శ్రీరామ రక్ష ఆ సంగతి ఇప్పటికీ కేసీఆర్ కి అర్ధం కావడం లేదని అంటున్నారు. తన వెంట ఉన్న వారినే ఆయన నమ్ముకుంటున్నారు. ఇంకా కాంగ్రెస్ సంగతి తేలుస్తాను అని అంటున్నారు. కేసీఆర్ కి అర్ధం కాని మరో విషయం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా పేక మేడలా లేదని, అందులో వర్గ పోరు అంతకంటే లేదని అంతా ఒక్కటిగా ఉంటున్నారని.

పైగా జనంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసం కూడా పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయం చేస్తూనే పాలనలో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత రావాలీ అంటే దానికి దశాబ్ద కాలం పట్టవచ్చు అని అంటున్నారు. అప్పటివరకూ పార్టీని నెట్టుకుని రావడం ఎలా అన్నదే ఇపుడు బీఆర్ఎస్ నేతలు ఆలోచించాలి. కానీ కాంగ్రెస్ మీద ఇంకా దుమ్మెత్తి పోసి నెగిటివిటీ నుంచి తన పార్టీని బలోపేతం చేసుకుంటున్న భ్రమలో ఉంటే మాత్రం మరోసారి పూర్తిగా ఇబ్బందులలో గులాబీ పార్టీ పడిపోవడం ఖాయం అని అంటున్నారు.