Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను కంగారు పెట్టిన పట్నం.. మంత్రి పదవి ఖరారు!

ఇంతకాలం ఎమ్మెల్సీ పదవితోనే కాలం గడుపుతున్న పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:03 AM GMT
కేసీఆర్ ను కంగారు పెట్టిన పట్నం.. మంత్రి పదవి ఖరారు!
X

షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల జాబితాను వెల్లడించేసిన వేళలో సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. మరో మూడు నెలలు మాత్రమే ఎన్నికలు ఉండటం.. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం వేళ.. ఇంతకాలం ఎమ్మెల్సీ పదవితోనే కాలం గడుపుతున్న పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయటం ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన పట్నం ఓటమి పాలు కావటం.. అనంతరం ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావటం తెలిసిందే. ఈసారి టికెట్ తనకు ఇవ్వకుంటే పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాల్ని పార్టీ అధినేతకు పంపారు. దీంతో యుద్ధ ప్రాతిపదిక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. పట్నంకు మంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధం కావటం సంచలనంగా మారింది.

2018 ఎన్నికల్లో తాండూరు నుంచి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం మూడు వేల ఓట్లే తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం గులాబీ కారు ఎక్కిన ఆయన ముఖ్యమంత్రికి సన్నిహితుడయ్యారు. గులాబీ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసి.. పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని బట్టబయలు చేసిన వారిలో రోహిత్ రెడ్డి ముఖ్యులు. అలాంటి రోహిత్ కు టికెట్ ఇవ్వకుండా ఉంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది.

అలాఅని.. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే.. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకురంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి తోడు రోహిత్ రెడ్డితో పట్నంకు ఎప్పటి నుంచో రాజకీయ శత్రుత్వం ఉంది. ఇలాంటి వేళ.. మధ్యే మార్గంగా పట్నంకు ఇప్పటికిప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టేసి.. ఆయన్ను సముచితంగా గౌరవించి.. రోహిత్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వటం ద్వారా.. ఎన్నికల్లో ఇద్దరు కలిసి పని చేసే రాజీ ఫార్మాలాను సిద్దం చేశారు గులాబీ బాస్.

ఇందులో భాగంగా ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఇంతకాలం మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న పట్నంకు కేబినెట్ లో చేరే అవకాశం లభించింది. ఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత నుంచి ఆ పదవిని ఎవరికి ఇవ్వలేదు. దీంతో.. పట్నంకు మంత్రి పదవి ఇచ్చే వీలు కలిగింది. ఈ రాజకీయ పరిణామాన్ని చూసినప్పుడు అందరిని తన కంట్రోల్ లో ఉంచుకునే కేసీఆర్ ను సైతం ప్రభావితం చేసిన పట్నం టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.