Begin typing your search above and press return to search.

అదేంది? సభకు వచ్చి నమస్కారం కూడా పెట్టలేదేంటి పెద్ద సారూ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ఓటమి తర్వాత విపక్ష బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సభ నల్గొండలోనిదే.

By:  Tupaki Desk   |   14 Feb 2024 8:16 AM GMT
అదేంది? సభకు వచ్చి నమస్కారం కూడా పెట్టలేదేంటి పెద్ద సారూ?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ఓటమి తర్వాత విపక్ష బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సభ నల్గొండలోనిదే. క్రిష్ణా ప్రాజెక్టులపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలతో పాటు.. రేవంత్ సర్కారు పని తీరుపైనా గులాబీ బాస్ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మీద.. ప్రభుత్వాధినేత మీదా.. పాలకుల మీద పరుషంగా మాట్లాడటం.. వారిపై విరుచుకుపడటాన్ని అర్థం చేసుకోవచ్చు.

కానీ.. ఎవరూ ఊహించని విధంగా ఆయన తీరు సభలో కనిపించిందని చెబుతున్నారు. సభా వేదిక మీదకు వచ్చిన సందర్భంగా అధినేతకు అందరూ నమస్కారాలు పెట్టటం.. ఆయన ఆశీస్సుల కోసం తపించటం కనిపించింది. అయితే.. తనకు నమస్కారాలు పెట్టిన వారికి కానీ.. ఆశీస్సులు కోరుకున్న వారికి కానీ ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోవటం చర్చనీయాంశంగా మారింది.

విపక్ష హోదాలో పెట్టిన బహిరంగ సభకు హాజరైన వేలాది మందికి సైతం సరైన రీతిలో అభివాదం చేయలేదన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు..తనను ఓడించిన ప్రజలను ఉద్దేశించి ఆయన కూసింత కోపంతో మాట్లాడిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును ఎలాంటి వారైనా అంగీకరిస్తారు. అయితే.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా కాస్తంత నిందాపూర్వక వ్యాఖ్యలు చేయటాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు’’ లాంటి వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడలేదు.

‘‘ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కోట్లాడడం మొగోళ్ల పని’’ అంటూ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. మొగోళ్లు .. ఆడోళ్లు అంటూ తేడా ఏంటి? ఆడోళ్లలో పోరాట పటిమ ఉండదన్నది కేసీఆర్ ఉద్దేశమా? అన్నది ప్రశ్నగా మారింది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఊళ్లోపంచాయితీ మాదిరి మాటలన్నంతనే.. చివ్వున లేచిన హరీశ్.. స్థానిక సంస్థల్ని అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. అలాంటప్పుడు.. ఇంత పెద్ద సభలో మహిళల్ని కించపరిచేలా మాట్లాడటాన్ని కూడా తప్పు పట్టాలి కదా?

‘‘మహిళల మీద ఉన్న కేసీఆర్ కు ఉన్న చిన్నచూపు మరోసారి మాటల్లో బయటపడింది. తెలంగాణ తొలి అసెంబ్లీలో మహిళా మంత్రులకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు. తెలంగాణ ఉద్యమంలో మొగోళ్లు మాత్రమే కాదు.. వారికి మించి మహిళలు రోడ్ల మీదకు వచ్చి పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతారా? అన్యాయంపై కోట్లాడటం మొగోళ్లు మాత్రమే చేస్తారన్న అర్థం వచ్చేలా మాట్లాడే కేసీఆర్ తన అహంకారాన్ని మరోసారి ప్రదర్శించారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడే తీరు కేసీఆర్ లాంటి విడిచిపెడితే మంచిది’’ అన్న అభిప్రాయాన్ని పలువురు వాట్సాప్ గ్రూపుల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు.