Begin typing your search above and press return to search.

'బాపూ'.. కేసీఆర్ కు సరికొత్త బ్రాండింగ్

ఇలాంటివేళ కేసీఆర్ కు సరికొత్త బ్రాండింగ్ దిశగా పార్టీ అడుగులు వేయటం షురూ చేసింది. ఇందుకు కేసీఆర్ పుట్టిన రోజును ముహుర్తంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 1:30 PM GMT
బాపూ.. కేసీఆర్ కు సరికొత్త బ్రాండింగ్
X

దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాల్ని మొదలు పెట్టిందా? ఈ మధ్య జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు టైరుకు పంక్చర్ కావటం.. అధికారాన్నికోల్పోవటం తెలిసిందే. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో తెలంగాణను ఎక్కడికో తీసుకెళ్లిన పాజిటివ్ ప్రచారానికి మార్కులు బాగానే పడినా.. ఎన్నికల్లో ఓటమిపై ఆ పార్టీ పోస్టుమార్టంషురూ చేసింది. నాన్ స్టాప్ అధికారంతో అహంకారం బాగా పెరిగిపోవటం ఓటమికి ప్రధాన కారణంగా ఇప్పటికే విశ్లేషణలు రావటం.. వాటిని గులాబీ పార్టీ నేతలు సైతం తమ అంతర్గత సంభాషణల్లో ఒప్పుకోవటం తెలిసిందే.

ఇలాంటివేళ కేసీఆర్ కు సరికొత్త బ్రాండింగ్ దిశగా పార్టీ అడుగులు వేయటం షురూ చేసింది. ఇందుకు కేసీఆర్ పుట్టిన రోజును ముహుర్తంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గత ఎంపీ ఎన్నికల వేళలో సారు.. కారు.. పదహారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాదు.. నిన్న మొన్నటి వరకు సారు.. సారు అంటూ పేర్కొనటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సారు పిలుపుతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్న మాట బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వ్యూహాన్ని మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

సారు అన్న పదంలో ప్రజలకు దగ్గరగా ఉండకపోవటాన్ని గుర్తించిన పార్టీ దిద్దుబాటు చర్యలకు తెర తీసింది. తెలంగాణలో ఇంటి పెద్దను.. గౌరవనీయ పదానికి నిదర్శనంగా పిలిచే బాపూ పదాన్ని కేసీఆర్ పేరుకు తగిలించాలన్న వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు (శనివారం, ఫిబ్రవరి 17) కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మీడియాకు ఇచ్చిన ప్రకటనల్లో కేసీఆర్ ను 'బాపూ' పేరును సంభోదిస్తూ భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం తెలిసిందే. ఇకపై సారు స్థానంలో బాపూ పేరును వాడకంలోకి తీసుకురావటం ద్వారా కేసీఆర్ ఇమేజ్ ను పెంచాలన్నది గులాబీ పార్టీ వ్యూహంగా చెబుతున్నారు. ఇదెంతవరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.