Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ నల్గొండ సభ అట్టర్‌ ఫ్లాప్‌!

ఈ నేపథ్యంలో చలో నల్గొండ సభపై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 2:48 PM GMT
కేసీఆర్‌ నల్గొండ సభ అట్టర్‌ ఫ్లాప్‌!
X

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన నల్గొండ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయ్యాక, స్వయంగా దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే కామారెడ్డిలో చిత్తయ్యాక తొలిసారి ఆయన బయటకు వచ్చి నిర్వహించిన బహిరంగ సభ.. నల్గొండ సభే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో చలో నల్గొండ సభపై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కేసీఆర్‌ కాలుకు ఇటీవల గాయమయ్యాక ఆయన పాల్గొన్న సభ కూడా ఇదే. అందులోనూ త్వరలో లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నల్గొండ సభ ద్వారా మళ్లీ ఉనికి చాటుకోవాలని బీఆర్‌ఎస్‌ భావించింది.

అయితే ఎప్పటిలానే యధావిధిగా కాంగ్రెస్‌ పార్టీ నేతలను కేసీఆర్‌ తిట్టిపోశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని చులకనగా తీసిపారేశారు. తద్వారా తనకు ప్రజాస్వామ్యమంటే గిట్టదని రుజువు చేసుకున్నారు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును తెచ్చుకున్నారంటూ కేసీఆర్‌ ఈసడించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి తెలంగాణ సెంటిమెంట్‌ పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం.. దాని ద్వారా లబ్ధి పొందడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్‌ మరోసారి తాజాగా అదేపని చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్టులను రేవంత్‌ ప్రభుత్వం కేంద్రానికి కట్టబెట్టిందంటూ కేసీఆర్‌ అసత్య ఆరోపణలు చేయడంపైనా విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ నే చంపుతారా.. దమ్ముంటే రండి అంటూ సవాళ్లు విసిరి దిగువ స్థాయి కార్యకర్తను తలపించే భాషను వాడటంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పంచ్‌ డైలాగులతో ప్రజలను ఆకట్టుకోవాలని చూసినా అవి పేలకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు ఉసూరుమన్నాయని అంటున్నారు. ప్రజల నుంచి కేసీఆర్‌ ప్రసంగానికి ఎలాంటి స్పందన దక్కలేదు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ చావుదెబ్బ తింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉండగా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఒకే ఒక్క సూర్యాపేటలో మాత్రమే అతి కష్టం మీద గెలిచింది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో తమ సత్తా చాటుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నల్గొండను తన మొదటి సభకు ఎంచుకున్నారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ తోపాటు బీఆర్‌ఎస్‌ ఘోరంగా ఓడిపోయాక నిర్వహించిన తొలి సభే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో రెండింటిని అమలు చేస్తోంది. మిగిలిన పథకాలను వీలైనంత త్వరగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు అన్ని పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది.

అయితే దాదాపు పదేళ్లు అధికారంలో ఉండి చాలా వరకు చేయలేకపోయిన కేసీఆర్‌ .. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాత్రమే వెంటనే చేసేయాలని హెచ్చరికలు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా కామారెడ్డిలో చిత్తుగా ఓడినా తెలంగాణకు తామే చక్రవర్తులం అన్నట్టు ఆయన మాట్లాడుతున్న భాషపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి శ్రీకాంతాచారిలాంటి యువకుల చావుకు కారణమైన కేసీఆర్‌ అదే నల్గొండ జిల్లాలో అలాంటి భావోద్వేగ రాజకీయాలకు శ్రీకారం చుట్టడంపై బీఆర్‌ఎస్‌ లోనే ఒక వర్గం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వాస్తవానికి ఎన్నికలకు ముందు రోజు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్‌ ఆడిన డ్రామా కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. కేసీఆర్‌ లేకపోతే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని చెప్పడానికే తన మిత్రుడైన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో కేసీఆర్‌ పెద్ద నాటకానికి తెరలేపారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని ప్రజలు నమ్మడంతో నాగార్జున సాగర్‌ ఉన్న నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోయింది.

నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తేనే తెలంగాణ వచ్చిందనే విషయం మరిచి తానే తెలంగాణ తెచ్చానంటూ కేసీఆర్‌ తనను తాను పొగడ్తలకే పరిమితమయ్యారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ విషయంలో విఫలమయ్యిందో కేసీఆర్‌ చెప్పలేకపోయారని అంటున్నారు. పైగా మంత్రులకు కళ్లు నెత్తికెక్కాయని, మంత్రులకు కండకావరమా, ఎన్ని గుండెలరా మీకు అంటూ దుర్భాషలకు దిగడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి కూడా కేసీఆర్‌ తాజా ప్రసంగానికి పెద్ద స్పందన దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ప్రసంగాలకు గతంలో ఉన్నట్టు చప్పట్లు కానీ, విజిల్స్‌ కానీ పడకపోవడం గమనార్హం. కాలు విరిగినా కట్టు కట్టుకుని సభకు వచ్చానంటూ సెంటిమెంటును పండించాలని చూసినా ప్రజలు పట్టించుకోలేదు. కేసీఆర్‌ ‘సెంటిమెంట్లను’ రెచ్చగొట్టి ఆయన చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే నల్గొండలో బీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని టాక్‌ నడుస్తోంది.