Begin typing your search above and press return to search.

ఏపీ అంతా చీకటి...కేసీయార్ మార్క్ ఫినిషింగ్ టచ్ !

పోలిక తెస్తున్నారు. ఏపీలో ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా మంత్రుల స్థాయిలో సాగిన ఈ తరహా విమర్శలకు కేసీయర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 2:21 AM GMT
ఏపీ అంతా చీకటి...కేసీయార్ మార్క్ ఫినిషింగ్ టచ్  !
X

తెలంగాణాలో ఎన్నికలు కాదు కానీ ఏపీని ముగ్గులోకి లాగుతున్నారు. పోలిక తెస్తున్నారు. ఏపీలో ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా మంత్రుల స్థాయిలో సాగిన ఈ తరహా విమర్శలకు కేసీయర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

ఏపీలో ఏమీ లేదు తెలంగాణా బాగుంది. ఇదే బీయారెస్ కొత్త నినాదంగా ఉంది. ఏపీలో అంతా చీకటి తెలంగాణా వెలిగిపోతోంది ఇలా పోలిక పెట్టి మరీ కేసీయార్ తన వాక్చాతుర్యం ప్రదర్శించారు. తెలంగాణాలో గడచిన తొమ్మిదిన్నరేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని అలాంటి ప్రగతి గతి ఏపీలో ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణాలో అన్నీ డబుల్ రోడ్లే అని కేసీయార్ చెబుతూ సింగిల్ రోడ్ ఉంది అంటే అది ఏపీ అనుకోవాల్సిందే అని సెటైర్లు కూడా వేశారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీయార్ మాట్లాడుతూ ఏపీ మీద విమర్శలతో తెలంగాణా జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఖమ్మం జిల్లా అంటే ఏపీ బోర్డర్ పైగా ఎక్కువ మంది అటూ ఇటూ కూడా ఉంటారు కాబట్టి కేసీయార్ ఆంధ్రా పోలికను బాగా తెచ్చేశారు. తెలంగాణా అభివృద్ధిని చూడాలంటే ఆంధ్రానే కొలమానంగా తీసుకోవాలని ఆయన అంటున్నారు.

ఏపీ నుంచి బియ్యాన్ని తెచ్చి తెలంగాణాలో అమ్ముతున్నారంటే తెలంగాణా అభివృద్ధి వేరేగా చెప్పాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ విషయంలో కూడా ఏపీ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని కేసీయార్ స్పష్టంగా చెబుతున్నారు. ఏపీలో కరెంట్ లేక చీకట్లు అన్నీ అలముకున్నాయని అదే తెలంగాణా బ్రహ్మాండంగా వెలిగిపోతోంది అని కేసీయార్ అంటున్నారు.

తాను ఎన్నికల ప్రణాళికలో చెప్పినవీ చెప్పనివీ చేశాను అని కేసీయార్ అంటూ సంక్షేమ పధకాలను అనేకమైనవి తెలంగాణాలో అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని ఆయన అంటున్నారు. దళిత బంధు లాంటి స్కీం తెలంగాణాలో తప్ప దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.

ఇక గిరిజనులకు పెద్ద ఎత్తున భూములను కేటాయించిన ఘనత తమదే అన్నారు. ఇలా ఏపీతో పోల్చుతూ తెలంగాణా గొప్పతనాన్ని కేసీయార్ ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తున్నారు. తెలంగాణా అభివృద్ధి సాగుతూంటే కొందరు దాన్ని కాదని అంటున్నారని, వారు అహంకారంతోనే అలా మాట్లాడుతున్నారని కేసీయార్ అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొందరు ఎప్పటికీ గుర్తించలేరని కానీ ప్రజలకు ఏమేమి చేశామో అన్నీ తెలుసు అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా బీయారెస్ కి అగ్ని పరీక్షంగా ఉంది. అక్కడే విజయం సాధించాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఆయన ధాటీగా ప్రసంగాన్ని చేశారు. అయితే ఏపీని చీకటి అని కేసీయార్ అనడం పట్ల రోడ్ల మీద కామెంట్స్ చేయడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది. ఏపీ పేరెత్తకుండా బీయారెస్ ఎన్నికల ప్రసంగాలు చేయలేదా అని అంటున్న వారూ ఉన్నారు. ఏపీని చిన్నచూపు చూడడం తగదని అంటున్న వారూ ఉన్నారు.