Begin typing your search above and press return to search.

ఓడిన వేళ ఈ తప్పులేంటి కేసీఆర్?

అసెబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ అపజయం ఖాయమైందన్న విషయంపై క్లారిటీ వచ్చిన వేళలో.. వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో పెద్ద ఎత్తున సర్య్కులేట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 11:15 AM GMT
ఓడిన వేళ ఈ తప్పులేంటి కేసీఆర్?
X

అసెబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ అపజయం ఖాయమైందన్న విషయంపై క్లారిటీ వచ్చిన వేళలో.. వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో పెద్ద ఎత్తున సర్య్కులేట్ అయ్యింది. అందులో అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. సంక్షిప్తంగా ఉన్న ఆ వీడియోలో కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘చాలామంది పోయిండు చరిత్రల. పెద్ద పెద్ద హిట్లర్లు.. ముసోలియన్లు.. నెపోలియన్లు..అందరూ పోయిండు. అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెబుతుంది సమాధానం. దేవుడు..దేవుడు కూడా కాపాడడు’’ అంటూ 19సెకన్ల నిడివి ఉన్న వీడియో వైరల్ గా మారింది. దీనికి మీద.. ‘‘మీరు కరెక్టుగా చెప్పారు సారూ’’ అంటూ ఉంది.

మిగిలిన చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ మెంట్ లో దూసుకెళుతోంది. అప్పులంటారా? ఇప్పుడున్న సంక్షేమ రాజ్యాల కాన్సెప్టులో వేలాది కోట్ల అప్పులు చేసేస్తుంటాయి ప్రభుత్వాలు. ఆ పాయింట్ ను పక్కన పెడితే.. ఇంత చేసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు కేసీఆర్ ను తిరస్కరించారన్న మాటకు వచ్చే సమాధానం.. ‘అహంకారం’. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వినియోగించాల్సింది పోయి.. అదే ప్రజలకు అందుబాటులోకి లేకుండా ఉండటం ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొచ్చింది.

అధికారంలో ఉన్న వేళలో.. తనలోని లోపాన్ని గుర్తించేందుకు ససేమిరా అన్న గులాబీ బాస్.. పార్టీ దారుణంగా ఓడిన తర్వాత కూడా ఆయన తనతప్పును దిద్దుకునే ప్రయత్నం చేయకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఫలితాలు వెల్లడైన న తర్వాత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ చేసిన తప్పుల్ని వరుస పెట్టి చెబుతున్నప్పుడు.. ప్రస్తావించిన అంశాల్ని చూసినప్పుడు కలిగే భావన ఒక్కటే. ఓడిన వేళ మనసుల్ని గెలవకుండా ఉండాలనుకోవటం ఏమిటి? అని. ఇంతకూ కేసీఆర్ చేసిన తప్పుల్ని చూస్తే..

మొదటి తప్పు

ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా? కేటీఆర్ సంగతే తీసుకుంటే.. పార్టీ తరఫున మాట్లాడిన ఆయన తాను చెప్పాల్సింది చెప్పారు. ప్రజలకు ఆయన స్పందించిన తీరును పలువురు ప్రశంసించటమే కాదు మీలాంటి వారిని ఐటీ మంత్రిగా మిస్ చేసుకోవటం బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కేటీఆర్ సంగతే ఇలా ఉంటే.. జరిగిన తప్పుల్ని ఒప్పుకొని.. పొరపాట్లను అంగీకరించి.. ప్రజలతీర్పును తాను గౌరవిస్తున్నట్లుగా చెప్పి ఉంటే ఎంత బాగుండేది? ఎంత మర్యాదగా ఉండేది? మరెంత హుందాతనంతో ఉండేది? కానీ.. ఇదేమీ చేయకుండా ఫాంహౌస్ కు వెళ్లిపోవటం దేనికి నిదర్శనం?

అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారంటూ మండి పడే కేసీఆర్.. ప్రజలు అందించిన విజయాన్ని ఎంజాయ్ చేస్తూ తన రాజకీయ ప్రత్యర్థులపై విలాసంగా జోకులు వేసేటప్పుడు ఉన్నంత హుషారు.. ఓడిన వేళ.. బాధ్యతతో రియాక్టు కావాల్సిన బాధ్యత లేదా? అన్నది ప్రశ్న.

రెండో తప్పు

ఎన్నికల్లో పార్టీ ఓడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం మామూలే. సంప్రదాయం ప్రకారం రాజ్ భవన్ కు వెళ్లి.. గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి రాజీనామా పత్రాన్ని ఇస్తుంటారు. అందుకు భిన్నంగా ప్రత్యేక దూత ద్వారా రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపటం దేనికి నిదర్శనం? గవర్నర్ తో పంచాయితీ ఉంటే ఉండొచ్చు. కానీ.. అదంతా వేరు. ప్రజలు ఒక ఫలితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించినట్లుగా వ్యవహరించాలి కదా? అలాంటిదేమీ లేకపోవటం ఏమిటి?

రేపొద్దున్న ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చేసే తప్పుల మీద గవర్నర్ వద్దకు వెళ్లాల్సి వస్తే.. ఏ ముఖం పెట్టుకొని వెళతారు? ఆ రోజున గవర్నర్ ను కలిసేందుకు సమయాన్ని అడిగి తీసుకోవాల్సి ఉంటుంది కదా? అవేమీ ఆలోచించరా?

మూడో తప్పు

ఎన్నికల్లో ఓటమితో పాటు.. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కామారెడ్డిలో స్వయంగా ఓటమిపాలు కావటం కేసీఆర్ కు బిగ్ షాక్ గా చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ జీవితం తొలినాళ్లలో తప్పించి.. మరెప్పుడూ ఓటమి రుచి చూడని ఆయన.. తనకు తాను తెలంగాణ బాపుగా చెప్పుకునే సందర్భంలో మాత్రం దిమ్మ తిరిగిపోయేలా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. అక్కడ తనను తిరస్కరించటం అది పెద్ద ఓటమిగా చెప్పాలి. పార్టీ ఓడిన దాని కంటే కూడా ఇది పెద్దది.

ఇలాంటి సందర్భంలో బయటకు వచ్చి.. కామారెడ్డి ప్రజలకు థ్యాంక్స్ చెప్పి.. మీ మనసుల్ని గెలుచుకోవటానికి మరోసారి ప్రయత్నిస్తానని చెప్పి ఉంటే ఎంత బాగుండేది. ఒకవేళ.. కేసీఆర్ నోటి నుంచి ఈ మాటలే వచ్చి ఉంటే.. అయ్యో.. సారును ఓడించి తప్పు చేశామే అన్న భావన కొందరిలో అయినా కలిగేది. కానీ.. అదేమీ లేకుండా తన దారిన తాను ఫామ్ హౌస్ కు వెళ్లటాన్ని ప్రజలు జీర్ణించుకోవటం కష్టమే కాదు.. మరీ.. ఇంత అన్యాయమా? అన్న మాట నోటి నుంచి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

నాలుగో తప్పు

ఓడిన వెంటనే ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లే వేళలో.. ప్రైవేటు కారులో వెళ్లటం.. సెక్యూరిటీని కూడా వద్దని చెప్పటం లాంటివి మీడియాలో వార్తల రూపంలో రావటం తెలిసిందే. ఈ వార్తల్ని చదివినప్పుడు కలిగే మొదటి ఫీలింగ్.. ఇదేదో.. అధికారం ఉన్నప్పుడు కూడా ఇంతే సింఫుల్ గా ఉండి ఉంటే ఎంత ఆదర్శంగా ఉండేది? ప్రగతి భవన్ నుంచి ఫాం హౌస్ వెళ్లేందుకు అనునిత్యం ఆ దారిన భద్రత కోసం ఉండే వందలాది పోలీసులు గడిచిన పదేళ్లుగా అనుభవించిన బాధ కథలు కథలుగా చెప్పేవారు. అధికారం చేతిలో లేనప్పుడు ఎలా ఉంటున్నారో.. అలానే చేతిలో ఉన్నప్పుడు కూడా ఉంటే సరిపోయేది కదా? ఈ చిన్న లాజిక్ కేసీఆర్ ఎందుకు మిస్ అయినట్లు?